YSRCP: ఏపీలో జరిగే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధం: ఏపీ సీఎం జగన్

  • పథకాల కొనసాగింపునకు వైసీపీకి ఓటు వేయాలన్న జగన్
  • ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పిన సీఎం
  • ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకే జమచేశామన్న జగన్
LIVE AP CM YS Jagan Public Meeting at Macherla


మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చెప్పారు. కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకునే ఎన్నికలు కావని, ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పారు. రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో రంగురంగుల కాగితాల్లో మేనిఫెస్టోలు ప్రకటించి ఎన్నికలయ్యాక వాటిని చెత్తబుట్టలోకి విసిరేస్తారని ప్రతిపక్షాలను విమర్శించారు.

 వైసీపీ మేనిఫెస్టో ప్రకటించాక దానిని ఓ భగవద్గీతలాగా, ఖురాన్ లా, బైబిల్ గా భావించి అందులో హామీలను 99 శాతం అమలు చేశామని జగన్ చెప్పారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం, డిజిటల్ మీడియాలో బోధన విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందని జగన్ ప్రభుత్వమేనన్నారు. ప్రతివిద్యార్థికి ట్యాబ్ లు,  ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రూపొందించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేశామని చెప్పారు.

మహిళల సాధికారత కోసం ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, కాపు నేస్తం, చేయూత, ఓబీసీ నేస్తం అందిచడంతోపాటు వారి పేరిట ఇళ్ల స్థలాలు కూడా అందించామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని జగన్ కోరారు.

  • Loading...

More Telugu News