Vidadala Rajini: గుంటూరులో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన విడదల రజని అనే మహిళ... తన భార్యను అపహరించారంటున్న భర్త

  • గుంటూరులో ఆసక్తికర పరిణామం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అను రాఘవరావు అనే వ్యక్తి
  • తన భార్య విడదల రజనిని నామినేషన్ వేయనివ్వకుండా అపహరించారని ఫిర్యాదు
  • తన భార్యను కారులో తీసుకెళ్లారని వెల్లడి
Interesting incident happens in Guntur West constituency

గుంటూరులో పశ్చిమ అసెంబ్లీ స్థానంలో అత్యంత ఆసక్తికర పరిణామం జరిగింది. గుంటూరు పశ్చిమ స్థానానికి నామినేషన్ వేసేందుకు విడదల రజని (మంత్రి కాదు) అనే మహిళ ప్రయత్నించింది. 

అయితే తన భార్య విడదల రజనిని నామినేషన్ దాఖలు చేయనివ్వకుండా కొందరు వ్యక్తులు అపహరించారంటూ ఏసుభక్త నగర్ కు చెందిన అను రాఘవరావు అనే వ్యక్తి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కారులో తీసుకెళ్లారని రాఘవరావు ఆరోపించాడు. 

దీనిపై న్యాయవాది శోభారాణి స్పందించారు. నామినేషన్ వేయకుండా ఓ మహిళను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు, పోలీసుల సాక్షిగా విడదల రజని అనే మహిళను ఎత్తుకెళ్లారని ఆమె ఆరోపించారు. నామినేషన్ కు వెళుతున్న వారిని అపహరించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపహరణకు గురైన మహిళలను తక్షణమే ఆమె భర్త వద్దకు చేర్చాలని న్యాయవాది శోభారాణి డిమాండ్ చేశారు. 

పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  

కాగా, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో మహిళ ఈ స్థానం నుంచే నామినేషన్ వేసేందుకు ప్రయత్నించడం, ఆమె కిడ్నాప్ కు గురైందంటూ భర్త పోలీసులను ఆశ్రయించడం గుంటూరు రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది.

More Telugu News