mahadev betting app: ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు

Tamannaah Bhatia summoned by Maharashtra cyber cell in Mahadev betting app case
  • మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ నెల 29న విచారణకు రావాలన్న మహారాష్ట్ర సైబర్ సెల్
  • మహాదేవ్ అనుబంధ సంస్థ ఫెయిర్ ప్లే యాప్ కు గతంలో ప్రమోషన్ చేసిన తమన్నా
  • గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందన్న వయాకామ్
  • దీనివల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వెల్లడి 
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు పంపింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థ ఫెయిర్ ప్లే యాప్ కోసం ప్రమోషన్ చేయడానికి సంబంధించి ఈ నెల 29న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. 

గతేడాది ఐపీఎల్ ఎడిషన్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందని.. దీనివల్ల తమకు రూ. కోట్లలో నష్టం వచ్చిందంటూ ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపించింది. దీంతో ఇందుకు సంబంధించి తమన్నాను సైబర్ సెల్ ప్రశ్నించనుంది. 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఇదే కేసులో ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సైబర్ సెల్ ఇప్పటికే సమన్లు పంపింది.  అయితే విదేశాల్లో ఉన్నందున సంజయ్ దత్ విచారణకు హాజరుకాలేదు. తన స్టేట్ మెంట్ నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్ ను కోరాడు.

మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ ఏడాది మొదట్లో తొమ్మిదో అరెస్టు చేసింది. ఈ కేసులో పలువురు రాజకీయ నాయకులు, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులోని ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ ను దుబాయ్ పోలీసులు గతేడాది డిసెంబర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈడీ చేసిన ఫిర్యాదుపై ఇంటర్ పోల్ రవి ఉప్పల్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో దుబాయ్ లోని స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
mahadev betting app
tamannaah bhatia
actress
case
promotion

More Telugu News