USA: ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు.. పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

  • జనాల వినాశనానికి సంబంధించిన ఆయుధ ఒప్పందాలను అడ్డుకుంటామని వెల్లడి
  • అంతరాయం కలిగించి.. చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ సరఫరాదారులపై ఆంక్షలు విధించడాన్ని సమర్థించుకున్న అగ్రరాజ్యం
Potential Risk Of Sanctions Over Trade Deal With Iran US Warns Pakistan

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌ సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. 

నెట్‌వర్క్‌ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. స్థూలంగా చెప్పాలంటే ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణించే ఎవరైనా ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నామని అన్నారు. 

ప్రజల వినాశనానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పంపిణీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి  ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు సరఫరాదారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్‌లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి పరికరాలు, ఇతర వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మూడు రోజుల పాకిస్థాన్‌ సందర్శన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా రైసీ పాక్ పర్యటనలో ఇరుదేశాలు 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

More Telugu News