Sunil Gavaskar: ఐపీఎల్ లో బౌండరీ లైన్ పరిధిపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunil Gavaskar proposes boundary line length in IPL should be extended
  • ఐపీఎల్ తాజా సీజన్ లో కొన్ని మ్యాచ్ ల్లో పరుగుల వెల్లువ
  • 250 పైచిలుకు స్కోర్లను ఈ సీజన్ లో మూడు సార్లు నమోదు చేసిన సన్ రైజర్స్
  • బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందన్న గవాస్కర్
  • బౌండరీ లైన్ ను 2 నుంచి 3 మీటర్లు పెంచాలని సూచన

ఐపీఎల్ తాజా సీజన్ లో బ్యాట్ దెబ్బకు బంతి బావురుమంటోంది! ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో చాలా వరకు బ్యాట్స్ మన్లదే ఆధిపత్యం కనిపించింది. కొన్ని మ్యాచ్ ల్లో అయితే పరుగుల సునామీ ఆవిష్కృతమైంది. ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టే 250 పైచిలుకు స్కోర్లను మూడు సార్లు నమోదు చేసిందంటే బౌలర్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో బ్యాట్స్ మన్లదే రాజ్యం అని అన్నారు. బ్యాట్స్ మన్ల తాకిడితో బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. బౌలర్లలో ఆత్మవిశ్వాసం దిగజారకుండా కాపాడాల్సిన బాధ్యత బీసీసీఐ పైనే ఉందని గవాస్కర్ స్పష్టం చేశారు. 

అయితే క్రికెట్ బ్యాట్లు ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు కాబట్టి వాటి గురించి తానేమీ వ్యాఖ్యానించబోనని... కానీ బౌలర్లకు కూడా లాభించేలా బౌండరీ లైన్ ను కాస్త వెనక్కి జరపడంపై బీసీసీఐకి సూచన చేయగలనని వివరించారు. ప్రతి స్టేడియంలో పిచ్ నుంచి బౌండరీ లైన్ దూరం పెంచాలని ఎప్పటి నుంచో చెబుతున్నానని, బౌండరీ లైన్ చుట్టూ ఉండే వాణిజ్య ప్రకటనల బోర్డులను కూడా వెనక్కి జరపాలని సూచించారు. 

కనీసం 2 నుంచి 3 మీటర్ల వెనక్కి బౌండరీ లైన్ ను వెనక్కి జరపాలన్నది తన ప్రతిపాదన అని గవాస్కర్ వెల్లడించారు. లేదంటే... బ్యాట్స్ మన్ల ధాటికి బౌలర్లు బలి కావడం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. 

ప్రతి మ్యాచ్ చావోరేవో అన్నట్టుగా కోచ్ లు తమ బ్యాటర్లకు నూరిపోస్తున్నట్టుందని, అందుకే బ్యాటర్లు వచ్చీ రావడంతోనే బాదుతున్నారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అందువల్ల మ్యాచ్ సాగే కొద్దీ ఆసక్తికరంగా ఉండడంలేదని వివరించారు.

  • Loading...

More Telugu News