Revanth Reddy: మోదీ తెలంగాణను అవమానించారు... నేనే ప్రత్యక్ష సాక్షిని: మహబూబాబాద్ సభలో రేవంత్ రెడ్డి

  • తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని మోదీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది నిజం కాదా? అని ప్రశ్న
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం చాలా అవసరమని వ్యాఖ్య
  • ప్రధాని మోదీ, గజ్వేల్ ఫామ్ హౌస్‌లో ఉండే కేడీ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శ
  • ఒక దొంగను అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపించారు... ఈసారి రెండో దొంగను పంపించాలన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy in Mahaboob Nagar meeting

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఇక్కడ ఓట్లు ఎలా అడుగుతారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించారని.. అందుకు తానే పార్లమెంట్‌లో సాక్షిని అన్నారు.

'మిత్రులారా... నేను పార్లమెంట్‌లో ప్రత్యక్షసాక్షిని. మొన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించారు. అంతటితో ఆగలేదు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంట్ బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించారని, ఆ తెలంగాణ బిల్లు చెల్లదని, తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని మోదీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది నిజం కాదా... ఈరోజు సిగ్గులేని కిషన్ రెడ్డిని అడుగుతున్నాను.. బీజేపీ నాయకులను... తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన మీరు... తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియాగాంధీని, కాంగ్రెస్‌ను తప్పుబట్టిన మీరు... ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు?" అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం చాలా అవసరమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మనం సీపీఐ, సీపీఎం, జనసమితి మద్దతును తీసుకున్నామన్నారు. మానుకోట కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అన్నారు. ప్రధాని మోదీ, గజ్వేల్ ఫామ్ హౌస్‌లో ఉండే కేడీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. వీరిద్దరు తోడు దొంగలని... ఇందులో ఒక దొంగను బండకేసి కొట్టి... రెండో దొంగను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకుంటే ఇక్కడి కేడీకి మద్దతు పలికింది మోదీయే కదా అని ఆరోపించారు. కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి ఆయనను జైలుకు పంపించలేదన్నారు. దేశంలో ఏ చట్టాలు వచ్చినా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు.

ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రిని ఇంటికి పంపించారని.. కూతురు మాలోతు కవితను కూడా ఇంటికి పంపించాలని కోరారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానన్నారు. మానుకోట గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించి... ఇండియా కూటమిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జూన్ 4న రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే బాధ్యత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు.

More Telugu News