ITCM: భారత్ ఐటీసీఎం క్షిపణి పరీక్ష విజయవంతం

  • దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్రూయిజ్ మిస్సైల్ కు రూపకల్పన
  • నేడు చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి దూసుకెళ్లిన ఐటీసీఎం
  • సంతృప్తికరంగా క్షిపణి ప్రయోగం 
  • డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
India test fires ITCM successfully

భారత్ తన రక్షణ రంగ పాటవానికి మరింత పదును పెడుతోంది. తాజాగా, మరో అస్త్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. దేశీయంగా రూపొందించిన క్రూయిజ్ మిస్సైల్ ను నేడు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఇండైజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్ (ఐటీసీఎం)గా పిలుస్తారు. ఐటీసీఎమ్ ను డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (బెంగళూరు) సంస్థ రూపొందించింది. 

ఇవాళ ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈఓటీఎస్), టెలీమెట్రీ వ్యవస్థల సాయంతో ఐటీసీఎమ్ గమనాన్ని, పనితీరును నిశితంగా పరిశీలించారు. ఈ క్షిపణిలోని వ్యవస్థలన్నీ అంచనాలకు అనుగుణంగా సమర్థత కనబర్చినట్టు గుర్తించారు.

అంతేకాదు, ఈ క్రూయిజ్ మిస్సైల్ గమనాన్ని భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకే-1 యుద్ధ విమానం నుంచి కూడా పరిశీలించారు. ఈ ఐటీసీఎం వే పాయింట్ నేవిగేషన్ ను ఉపయోగించుకుని సముద్ర ఉపరితలంపై తక్కువ ఎత్తులో ప్రయాణించి తన సత్తా చాటింది. 

ఇందులో వినియోగించిన దేశీయ ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరు భేషుగ్గా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ను బెంగళూరుకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్ (జీటీఆర్ఈ) తయారుచేసింది. ఐటీసీఎం విజయవంతమైన సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.

More Telugu News