Air India Express: మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌!

  • దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం
  • ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ
  • మొబైల్ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్ నుంచి విమాన‌ టికెట్ బుకింగ్‌
  • ఈ టికెట్ల‌తో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే వెసులుబాటు
Air India Express offering 19 percent discount for first time voters aged 18 to 22

మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంప‌ర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్ర‌త్యేక ప్రచార కార్య‌క్ర‌మాన్ని (#VoteAsYouAre) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ స‌ర్వీసుల‌లో విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీని అందిస్తోంది. 

మొబైల్ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్ నుంచి విమాన‌ టికెట్‌ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ఓటర్లు సంబంధిత నియోజకవర్గానికి సమీపంలోని విమానాశ్రయానికి ప్రయాణించడం కోసం విమాన‌ టికెట్ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్, ఎక్స్‌ప్రెస్ వాల్యూ, ఎక్స్‌ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్‌ప్రెస్ బిజ్ విభాగాల‌కు వర్తిస్తుందని విమాన‌యాన సంస్థ స్ప‌ష్టం చేసింది. 

అలాగే ఆఫ‌ర్ పొంద‌డం కోసం ఐడీతో పాటు ఇత‌ర సంబంధిత ధ్రువప‌త్రాలు చూపించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ఏప్రిల్ 29న తన 19వ వార్షికోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా మన దేశ భవిష్యత్తును పెంపొందించడంలో యువతదే కీలక పాత్ర అని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ పేర్కొ్నారు. వారిని ప్రోత్సహించి మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకునేలా సులభతరం చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News