బోండా ఉమను ఇరికించే కుట్ర.. ఏపీ సీఈవో మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు
- సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై విమర్శలు
- సీఈవోకు మెసేజ్ పెట్టామని, ఆయన ఇంకా స్పందించలేదని వివరణ
- ఏపీ డీజీపీకి కూడా మెసేజ్ చేశామన్న వర్ల రామయ్య
విజయవాడలో సీఎంపై దాడి పూర్తిగా స్క్రిప్టెడ్ డ్రామా అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. విజయవాడ కమిషనర్ పై తమకు నమ్మకంలేదని, అధికార పార్టీకి అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో జగన్ ఈ గులకరాయి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. బోండా ఉమ గెలుపు ఖాయం కావడంతో ఎలాగైనా ఆయనను ఇబ్బంది పెట్టాలని, రాజకీయంగా అన్ పాప్యులర్ చేయాలని వైసీపీ ఆడుతున్న నాటకమని విమర్శించారు. ఈ విషయంపై అవసరమైతే బుధవారం సాయంత్రం ఏపీ సీఈవో మీనాను కలుస్తామని వర్ల రామయ్య చెప్పారు.