supreme court: మీరేం అమాయకులు కాదు..!: బాబా రాందేవ్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • పతంజలి ప్రకటనల కేసులో కొనసాగిన విచారణ
  • ఇకపై జాగ్రత్తగా ఉంటానన్న రాందేవ్
  • ఈ నెల కేసు విచారణ 23కు వాయిదా
you are not so innocent

పతంజలి ఆయుర్వేద్ పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, కోవిడ్ వ్యాధికి చికిత్స ఉందంటూ పేర్కొనడాన్ని గత విచారణ సందర్భంగా తీవ్ర స్థాయిలో తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజా విచారణలో యోగా గురువు బాబా రాందేవ్, ఆయన సహాయకుడు బాలకృష్ణ వాదనలను వినడం జరిగింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎ. అమానుల్లాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉదయం వారిని తమ ముందుకు పిలిచింది. దేశంలో యోగా వ్యాప్తికి వారు విశేష కృషి చేశారని పేర్కొంది. “మీరు యోగాకు అందించిన కృషిని మేం గౌరవిస్తాం” అని తెలిపింది.

చట్టం అందరికీ సమానమే..
ఈ సందర్భంగా రాందేవ్, బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదన్నారు. వారి ఉద్దేశాన్ని గమనించిన ధర్మాసనం.. ఆయుర్వేదం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు ఇతర వైద్య విధానాలను ఎందుకు తక్కువ చేసి చూపారని ప్రశ్నించింది. చట్టం అందరికీ సమానమేనని ఈ సందర్భంగా జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. 

దీంతో ఇకపై జాగ్రత్తగా ఉంటానని రాందేవ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. “మిమ్మల్ని క్షమించాలా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  మీరు మా ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు మా పరిగణనలో ఉన్నాయి. మీరు కోర్టులో ఏం జరుగుతోందో తెలియనంత అమాయకులేం కాదు” అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఉద్దేశాన్ని తెలియజేసేలా తీసుకున్న చర్యల గురించి వివరించేందుకు మళ్లీ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసు వాయిదా అనంతరం బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడారు. “నేను చెప్పాలనుకున్నది చెప్పాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. 

గత విచారణలో క్షమాపణ అఫిడవిట్లను తోసిపుచ్చిన సుప్రీం
ఈ కేసులో రాందేవ్, బాలకృష్ణ కోర్టుకు రెండు సార్లు క్షమాపణ లేఖలు సమర్పించగా వాటిని ముందుగా మీడియాకు విడుదల చేయడంతో సుప్రీంకోర్టు తిరస్కరించింది. గత వారం విచారణ సందర్భంగా జస్టిస్ హిమా కోహ్లీ వారి తీరుపై మండిపడ్డారు. “ఈ అంశం కోర్టుకెక్కేదాకా వారు క్షమాపణ అఫిడవిట్లను సమర్పించాలని అనుకోలేదు. వారు కచ్చితంగా పబ్లిసిటీ కోరుకుంటున్నారు” అని జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు. జస్టిస్ అమానుల్లా సైతం రాందేవ్, బాలకృష్ణ తీరును ఆక్షేపించారు. “మీ క్షమాపణ మనస్ఫూర్తిగానే చెప్పిందేనా? కేవలం క్షమాపణ చెప్పడం ఒక్కటే సరిపోదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు వాటి పర్యవసానాలను మీరు ఎదుర్కోవాలి” అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు.

ఇదీ కేసు నేపథ్యం..
దేశంలో కోవిడ్ వ్యాప్తి చెందిన వేళ 2021లో పతంజలి ఆయుర్వేద్ కొరోనిల్ అనే మందును మార్కెట్లోకి విడుదల చేయడం ఈ వివాదానికి దారితీసింది. కోవిడ్ కు తొలి ఆధారభూత ఔషధంగా దీన్ని రాందేవ్ బాబా అభివర్ణించారు. అయితే కొరోనిల్ మందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని రాందేవ్ పేర్కొనడాన్ని శుద్ధ అబద్ధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివర్ణించింది. 

గతంలో ఓ వీడియోలో రాందేవ్ మాట్లాడుతూ ఆధునిక సైన్స్ ఏదీ కోవిడ్ వ్యాధిని నయం చేయలేకపోతోందన్నారు. అల్లోపతిని మూర్ఖపు, దివాలా తీసిన శాస్ర్తంగా అభివర్ణించారు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాందేవ్ బాబాకు లీగల్ నోటీసు పంపింది. రాందేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే దీనిపై స్పందించిన పతంజలి యోగపీఠం... రాందేవ్ కేవలం వాట్సాప్ లో వచ్చిన ఓ సందేశాన్ని మాత్రమే చదివి వినిపించారని... ఆధునిక సైన్స్ పై ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చింది.

 అనంతరం 2022 ఆగస్టులో పతంజలి ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన మరింత వివాదం రాజేసింది. ఫార్మా, వైద్య రంగం వ్యాపింపజేసే అపోహల నుంచి ప్రజలు వారిని వారు కాపాడుకొని దేశాన్ని కాపాడాలని అందులో పతంజలి పేర్కొంది. అలాగే షుగర్, హైబీపీ, థైరాయిడ్, లివర్ వ్యాధి, కీళ్ల నొప్పులు, ఆస్తమా లాంటి రోగాలను పతంజలి మందులు నయం చేశాయని ప్రకటనలో తెలిపింది. దీన్ని తప్పుబడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

More Telugu News