KKR: సాల్ట్ అండ్ అయ్యర్... లక్నో జట్టును అవలీలగా ఓడించిన కేకేఆర్

  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • సొంతగడ్డపై అదరగొట్టిన నైట్ రైడర్స్
  • లక్నోపై 8 వికెట్ల తేడాతో విక్టరీ
  • 162 పరుగుల విజయలక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన కేకేఆర్
KKR easy win against LSG

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో అవలీలగా గెలిచింది. లక్నో జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 

ఓపెనర్ ఫిల్ సాల్ట్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జోడీ సాల్ట్ అండ్ పెప్పర్ లా ఘాటైన ఆటతీరుతో అదరగొట్టింది. సాల్ట్ 47 బంతుల్లో 89 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. అతడి స్కోరులో ఏకంగా 14 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో శ్రేయాస్ అయ్యర్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. 

కోల్ కతా ఇన్నింగ్స్ లో సునీల్ నరైన్ (6), ఆంగ్ క్రిష్ రఘువంశీ (7) విఫలమయ్యారు. ఈ రెండు వికెట్లు మొహిసిన్ ఖాన్ ఖాతాలో చేరాయి. టోర్నీలో కోల్ కతా కు ఇది నాలుగో విజయం. 

అంతకుముందు, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. నికోలాస్ పూరన్ 45, ఆయుష్ బదోనీ 29, కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆకట్టుకునేలా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. 

నేటి రెండో మ్యాచ్ లో ముంబయి, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ

నేడు ఐపీఎల్ రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదిక. సొంతగడ్డపై టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ పతిరణ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. తీక్షణ స్థానంలో పతిరణ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. మరోవైపు ముంబయి ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పు లేవు.

More Telugu News