Stone Attack On Jagan: ఒకే రాయి మూడు గాయాలు చేసింది... ఇది ఎలా సాధ్యం?: ఆనం వెంకట రమణారెడ్డి

  • విజయవాడలో నిన్న సీఎం జగన్ పై రాయితో దాడి
  • సందేహాలు వ్యక్తం చేసిన ఆనం వెంకటరమణారెడ్డి
  • వాలంటీర్లకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లిందని వ్యాఖ్యలు
Anam Venkataramana Reddy raises doubts over stone attack on Jagan

గత రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి సమీపంలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పలు సందేహాలు లేవనెత్తారు. ఒకే రాయి మూడు గాయాలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. 

పక్కనే ఉన్న రెండంతస్తుల భవనం నుంచి వచ్చిన ఆ రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ కాలుపై పడి కాలికి సైతం గాయం అయిందట... మరి ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు అని నిలదీశారు. సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజి కట్టి  ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆనం ప్రదర్శించారు. సీఎం జగన్ నిన్నటి ఘటనలో అద్భుతంగా నటించారు అని వ్యంగ్యం ప్రదర్శించారు.

"నిన్న రాత్రి 8.15 గంటలకే వాలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్లింది? వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, జగన్ పై హత్యాయత్నం జరిగింది... టీవీలు చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 8.10 గంటలకు ఘటన జరిగితే, 8.13 గంటలకే సోషల్ మీడియా స్క్రోలింగ్ ప్రారంభమైంది" అని ఆనం వివరించారు. 

ఈ ఘటన కూడా ఒక డ్రామా అని, రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని, గాల్లో ఉన్న డ్రోన్లు కిందికి దిగిపోయాయని అన్నారు. పక్కా స్కెచ్ తో జరిగిన ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆనం అనుమానం వ్యక్తం చేశారు. 

భారతీ రెడ్డి డైరెక్షన్ లో ఈ డ్రామా జరిగిందని, సీఎం ర్యాలీలో కరెంట్ ఉండదా, డ్రోన్ విజువల్స్ ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఈ డ్రామాకు తెరలేపిందని అన్నారు.

More Telugu News