KA Paul: ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తు... ఉబ్బితబ్బిబ్బయిన కేఏ పాల్

KA Paul feels happy with Pot symbol for his Praja Santhi party in upcoming elections
  • ప్రజాశాంతి పార్టీకి ఇటీవల కుండ గుర్తు కేటాయించిన ఈసీ
  • కుండ గొప్పదనాన్ని వివరించిన కేఏ పాల్
  • తమ విజయానికి ఇదే నిదర్శనం అని వెల్లడి 
కేఏ పాల్ నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీ గత ఎన్నికల్లో హెలికాప్టర్ గుర్తుపై పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ గుర్తు మారింది. రాబోయే ఎన్నికల కోసం ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కొన్ని రోజుల కిందట కుండ గుర్తు కేటాయించింది. 

దీనిపై కేఏ పాల్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. చేతిలో కుండ పట్టుకుని, కుండ విశిష్టతను వివరించారు. కుండ జీవాన్ని ఇస్తుందని, సత్యాన్ని, మంచిని ఇస్తుందని అన్నారు. కుండ గుర్తు రావడం పట్ల కన్నీరు ఉబికి వస్తోందని అన్నారు. మన విజయానికి కుండ గుర్తే నిదర్శనం అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

"అయ్యో... మనకు ఎన్నికల గుర్తు ఇవ్వరేమో అని బాధపడిన వాళ్లు ఉన్నారు... ఇంకా ఎవరికైనా అనుమానం ఉందా? ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో నేనే స్వయంగా హాజరై వాదనలు వినిపించి ఈ కుండ గుర్తు సంపాదించుకొచ్చాను. ఇప్పటికైనా ఒకటి ఆలోచించండి... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని, ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఏపీలో 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేడా? మా 33 సూత్రాల్లో ఆరు గుర్తుంచుకున్నా చాలు. మా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి... విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి... 175 అసెంబ్లీ స్థానాల్లో 100 మందిని గెలిపించుకోండి... మీ జీవితాలు మార్చుకోండి" అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
KA Paul
Pot
Praja Santhi Party
Election Symbol
Andhra Pradesh
Telangana

More Telugu News