ఇకపై నగ్న చిత్రాలు బ్లర్.. త్వరలో ఇన్‌స్టాలో కొత్త ఫీచర్!
- చిన్నారులు, టీనేజర్ల రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న మెటా
- యూజర్ల మొబైల్స్‌లోని టూల్‌తో డైరెక్ట్ మెసేజీల్లోని చిత్రాలపై నిఘా
- నగ్న, అసభ్యకర చిత్రాలు కనిపిస్తే బ్లర్ చేసేలా వ్యవస్థ ఏర్పాటు
- ఎండ్ టూ ఎండ్ విధానంలో ఈ పరిశీలన సాగుతుందన్న మెటా
యూజర్ల మొబైల్ ఫోన్లోని మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ విధానంలో చిత్రాల పరిశీలన జరుపుతుందని సంస్థ పేర్కొంది. కాబట్టి, ఈ వివరాలు ఇన్‌స్టాకు చేరే అవకాశమే లేదని వెల్లడించింది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజీలకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మెటా మెసెంజర్, వాట్సాప్‌లో ఈ ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉంది.
టీనేజర్లకు ఇన్‌స్టా ఓ వ్యసనంగా మారుతోందన్న ఆందోళన అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికి తోడు సైబర్ నేరగాళ్లు ఈ వేదిక ద్వారా లైంగిక దోపిడీ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఇన్‌స్టా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అనేక దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో అమెరికాలోని 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఫేస్‌బుక్‌పై కేసు పెట్టారు. ఈ వేదికలతో కలిగే ప్రమాదాలపై సంస్థ ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. చట్టవ్యతిరేక, హాని కారక సమాచారం నుంచి చిన్నారులను కాపాడేందుకు మెటా ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని యూరోపిన్ కమిషన్ కూడా ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.