Iran: ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం.. మధ్యలో కలగజేసుకోవద్దు: అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ

  • సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామన్న ఇరాన్
  • నెతన్యాహూ ఉచ్చులో పడొద్దని అమెరికాకు హెచ్చరిక
  • జోక్యం చేసుకుంటే అమెరికాపైనా దాడులు ఉంటాయని వార్నింగ్
Iran Tells USA to Step Aside As It Prepares to Attack on Israel

సిరియాలోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్‌పై దాడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఉచ్చులో పడొద్దని కోరింది. మధ్యలో కలగజేసుకుంటే అమెరికా కూడా దెబ్బతింటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ జంషిద్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ లేఖపై స్పందించిన అమెరికా తమపై దాడులు చేయవద్దంటూ కోరిందన్నారు. మధ్యప్రాచ్యంలో తన ప్రధాన మిత్రపక్షమైన మిలిటెంట్ గ్రూపు ‘హిజ్బుల్లా’.. ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్న వేళ ఇరాన్ ఈ  లేఖ రాయడం గమనార్హం. కాగా ఇరాన్ లేఖపై అమెరికా అధికారికంగా ఇప్పటివరకూ స్పందించలేదు. 

కాగా ఇజ్రాయెల్‌ లేఖ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ లేదా అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడి చేస్తే ప్రతిస్పందించేందుకు సన్నద్ధమవుతోందంటూ ఓ అధికారి చెప్పినట్టుగా పేర్కొంది. ఇక ఇజ్రాయెల్‌పై దాడి జరగవచ్చని అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన చెందుతున్నారని ఇద్దరు అధికారులు తెలిపినట్టుగా కథనంలో ప్రస్తావించింది. పౌరుల కంటే సైనిక లేదా గూఢచార లక్ష్యాలపై దాడులకు అవకాశం ఉందని కలవరం చెందుతున్నట్టుగా పేర్కొంది. మరోవైపు.. మధ్యప్రాచ్యంలోని తమ బలగాలు, స్థావరాలపై దాడులు జరగకుండా నిరోధించేందుకు అమెరికా రంగంలోకి దిగిందని, అసాధారణ రీతిలో ఇరాన్‌తో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు బైడెన్ సర్కారు రంగంలోకి దిగిందని బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.

  • Loading...

More Telugu News