Mayank Yadav: రెండు రోజుల్లోనే బద్దలైన మయాంక్ యాదవ్ ఐపీఎల్ రికార్డ్.. త్రుటిలో ఆల్‌టైం రికార్డును మిస్ చేసుకున్న కోయెట్జీ

Mayank Yadavs record lasts 2 days as Gerald Coetzee clocks fastest ball of IPL 2024
  • పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన మయాంక్ యాదవ్
  • మూడుసార్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ వేసిన మయాంక్
  • రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ రికార్డును బద్దలుగొట్టిన గెరాల్డ్ కోయెట్జీ
  • 157.4 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన కోయెట్జీ
  • 2011 ఐపీఎల్‌లో 157.71 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసిన షాన్ టెయిట్
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో నెలకొల్పిన అత్యంత వేగవంతమైన డెలివరీ రికార్డు రెండు రోజుల్లోనే చెరిగిపోయింది. వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ వికెట్లు పడగొట్టనప్పటికీ అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 157.4 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ సాధించిన రికార్డు బద్దలైంది. 

ఆ మ్యాచ్‌లో మయాంక్ మూడుసార్లు అత్యంత వేగవంతమైన బంతులు సంధించాడు. తొలి బంతిని 155.8 కిలోమీటర్ల వేగంతో సంధించగా, ఆ తర్వాతి రెండు బంతులను 153.9, 153.4 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నాంద్రే బర్జర్ ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాంద్రే 153 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో షాన్ టెయిట్ ముందున్నాడు. 2011 సీజన్‌లో టెయిట్ 157.71 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసి ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సాధించాడు. కోయెట్జీ ఇప్పుడు 157.4 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి త్రుటిలో ఆల్‌టైం రికార్డు మిస్సయ్యాడు. 13 సీజన్లుగా టెయిట్ రికార్డు భద్రంగా ఉంది.
Mayank Yadav
Gerald Coetzee
IPL 2024
Shaun Tait
LSG
MI
RR

More Telugu News