Thummala: రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన

  • వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న తుమ్మల
  • రూ.2 లక్షల రుణమాఫీ అమలుకై ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడి
  • రైతుల శ్రేయస్సు కోసం తాము పని చేస్తున్నామన్న మంత్రి తుమ్మల  
Minister Tummala Nageswara Rao on loan waiver

రైతు రుణమాఫీపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. 

శుక్రవారం ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని... అయినప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం తాము పని చేస్తున్నామన్నారు. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 92 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయన్నారు.

గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో జమ చేయలేదని విమర్శించారు. 2018-19లో 5 నెలలు పట్టిందని, 2023-24లో దాదాపు నాలుగు నెలలు పట్టిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తాము ఆలస్యం చేస్తున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పొలాలను సందర్శించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుబంధు, రుణమాఫీపై రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

More Telugu News