Harish Rao: రాజకీయ అవకాశవాదులు... పవర్ బ్రోకర్లు... కాళ్లు మొక్కినా ఇక రానివ్వం: పార్టీ మారుతున్న వారిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

  • ఉద్యమం సమయంలోనూ కాంగ్రెస్ రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆగ్రహం
  • నాయకులను కొన్నా... కార్యకర్తలను, ప్రజలను కొనలేరన్న హరీశ్ రావు
  • మధ్యలో వచ్చిన వారు పార్టీని వదిలి వెళ్తున్నారన్న హరీశ్ రావు
  • దుబ్బాక గడ్డ బీఆర్ఎస్ అడ్డా... దుబ్బాక గడ్డ ఉద్యమకారుల గడ్డ అని నినదించిన సిద్దిపేట ఎమ్మెల్యే
Harish Rao fires at who leaving brs

పార్టీ వీడుతున్న వారిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు.. పవర్ బ్రోకర్లు ఈరోజు పార్టీని విడిచి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పార్టీ పెట్టినప్పుడు కూడా పదిమంది మాత్రమే ఉన్నారని... ఆ సమయంలో తెలంగాణ వచ్చేది లేదు.. సచ్చేది లేదని వెటకారం చేశారని... కానీ కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చారన్నారు. ఉద్యమం సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తీసుకువెళ్లిందని ఆరోపించారు. నాయకులను కొంటున్నారని.. కానీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను వారు కొనలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన సభలో హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ నుంచి వెళ్లేవారు మధ్యలో వచ్చిన వారేనని మండిపడ్డారు. వారంతా పవర్ బ్రోకర్లు అని ఆరోపించారు. కార్యకర్తలు, ఉద్యమకారులు పార్టీని విడిచి వెళ్లడం లేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి వెళ్లడమంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అన్నారు. ఇది శిశిర రుతువు... ఆకులు రాలే కాలం... ఇప్పుడు పార్టీని వీడి వెళ్లేవారు కూడా చెత్తకుప్పలో కలిసి పోతారన్నారు. ఆకులు రాలిపోయాక కొత్త చిగురు వచ్చినట్లు... పార్టీ పుంజుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు.

దుబ్బాక గడ్డ బీఆర్ఎస్ అడ్డా

దుబ్బాక గడ్డ బీఆర్ఎస్ అడ్డా... దుబ్బాక గడ్డ ఉద్యమకారుల గడ్డ అన్నారాయన. ఉద్యమం సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసిన సమయంలో అక్కడి నాయకులను కాంగ్రెస్ కొనుగోలు చేసిందని... కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌నే గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులను కొని గెలుస్తామనుకుంటున్నారని... హామీల విషయంలో మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఫేక్ వార్తలు రాయించుకుంటోందని విమర్శించారు. 

వెంకట్రామిరెడ్డి డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని... ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారన్నారు. కేసీఆర్ సహకారంతో సిద్దిపేటను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత వెంకట్రామిరెడ్డిది అని కొనియాడారు. రేపు ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ ప్రజల తరఫున గళం విప్పుతారన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలన్నా... మన వీధిలో... మన గ్రామంలో బీఆర్ఎస్‌కు అధిక మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తాము వెంకట్రామిరెడ్డి అనుకొని కష్టపడాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే అన్నారు. తెలంగాణను మోసం చేశాయన్నారు. తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

More Telugu News