Govinda: 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ గోవిందా

Govinda Returns To Politics After 14 Year and Joins Shiv Sena
  • 2004లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచిన గోవిందా
  • నిన్న శివసేనలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు
  • మోదీ, షిండేలపై ప్రశంసలు కురిపించిన గోవిందా
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాకు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. 1990లలో హీరోగా ఆయన బాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. గోవిందా డ్యాన్యులు అప్పట్లో ప్రేక్షకులను మైమరపించాయి. తాజాగా గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. దాదాపు 14 ఏళ్ల బ్రేక్ తర్వాత పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన (షిండే వర్గం)లో నిన్న ఆయన చేరారు. సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో ఆయన శివసేన కండువా కప్పుకున్నారు. 

2004 కాంగ్రెస్ తరపున లోక్ సభకు గోవిందా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా బాధ్యతను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత రామ్ నాయక్ ను గోవిందా మట్టి కరిపించి, రాజకీయాల్లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు. తన లోక్ సభ సభ్యత్వం ముగిసిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇక శివసేనలో చేరిన సందర్భంగా గోవిందా మాట్లాడుతూ.. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే కళలు, సాంస్కృతిక రంగాల కోసం పని చేస్తానని చెప్పారు. షిండే సీఎం అయిన తర్వాత ముంబై మరింత అందమైన, మరింత అభివృద్ధి చెందిన నగరంగా అవతరించిందని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నమ్మశక్యం కాని రీతిలో మన దేశం అభివృద్ధి చెందిందని గోవిందా కితాబిచ్చారు. 

సీఎం షిండే మాట్లాడుతూ... అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి గోవిందా అని ప్రశంసించారు. మోదీ అభివృద్ధి పాలసీల పట్ల గోవిందా ఎంతో తృప్తిగా ఉన్నారని చెప్పారు. సినీ రంగ పురోగతి కోసం ఏదో చేయాలనే తపన గోవిందాలో ఉందని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి - ప్రభుత్వానికి మధ్య గోవిందా వారధిగా ఉంటారనే విషయాన్ని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే పార్టీలో ఆయన చేరారని తెలిపారు.
Govinda
Bollywood
Shiv Sena
Eknath Shinde
Narendra Modi
BJP

More Telugu News