Narendra Modi: కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే కౌంటర్

Mallikarjuna Kharge gave strong counter to Prime Minister Modi over his severely criticism on Congress party
  • మీ హయాంలో నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు మీడియా ముందుకు వచ్చారన్న విషయాన్ని మరచిపోయారని విమర్శలు
  • పశ్చిమబెంగాల్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తికి మీ పార్టీ సీటు ఇచ్చిందన్న మల్లికార్జున ఖర్గే
  • ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి గట్టి కౌంటర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసిన నేపథ్యంలో.. కనుబొమ్మలు ఎగరేస్తూ ఇతరులను వేధించడం కాంగ్రెస్ సంస్కృతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తీవ్ర విమర్శలకు హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టికౌంటర్ ఇచ్చారు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ప్రధాని మోదీ గారూ.. మీరు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు సరే. నలుగురు అత్యున్నత స్థాయి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని మరచిపోయారా? ప్రజాస్వామ్య విధ్వంసం జరుగుతోందంటూ జడ్జిలు గళం విప్పింది మీ హయాంలోనే. ఆ నలుగురు జడ్జిల్లో ఒకరిని మీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. 'నిబద్ధత గల న్యాయవ్యవస్థ'ను కోరుకుంటున్నది ఎవరు?’’ అని మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

‘‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తిని పశ్చిమ బెంగాల్‌లో మీ పార్టీ పోటీకి దింపిన విషయాన్ని మీరు మరచిపోయారు. ఆ జడ్జికి మీ పార్టీ అభ్యర్థిత్వం ఎందుకు దక్కింది? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను (ఎన్‌జేఏసీ) ఎవరు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు దానిని ఎందుకు నిలిపివేసింది?’’ అని ప్రశ్నల రూపంలో మోదీ ప్రభుత్వాన్ని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘‘వ్యవస్థలను ఒకదాని తర్వాత మరొక దాన్ని బెదిరిస్తున్నది మీరే. మీరు పాపాలు చేసి కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం ఆపండి. ప్రజాస్వామ్యాన్ని ఏమార్చడం, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీయడంలో మీరు సిద్ధహస్తులు!’’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కాగా దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు గురువారం లేఖ రాశారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థశక్తులు ఒత్తిడి వ్యూహాలను అమలుచేస్తున్నాయని లేఖలో లాయర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Narendra Modi
Mallikarjun Kharge
Congress
BJP
Supreme Court

More Telugu News