BJP: తెలంగాణ‌లో గూగుల్‌, యూట్యూబ్ ప్ర‌క‌ట‌న‌ల్లో బీజేపీ టాప్

  • 2024 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వ‌ర‌కు డేటా ఆధారంగా గూగుల్ రిపోర్టు
  • దాదాపు రెండు నెలల వ్య‌వ‌ధిలో అన్ని పార్టీలు క‌లిపి ప్ర‌క‌ట‌న‌ల కోసం చేసిన ఖ‌ర్చు రూ. 30.2 కోట్లు 
  • ఇందులో బీజేపీ వాటానే రూ.12 కోట్లు 
  • అన్ని పార్టీలు క‌లిపి 15,690 ప్ర‌క‌ట‌న‌లు ఇస్తే.. కాషాయ పార్టీ 11,613 యాడ్స్ ఇచ్చిన వైనం 
  • ఇదే కాల‌ప‌రిమితిలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే రూ. 15.8 కోట్ల వ్య‌యంతో యూపీ టాప్‌  
BJP Top Advertiser On Google and YouTube In Telangana

తెలంగాణ‌ రాష్ట్రంలో గూగుల్‌, యూట్యూబ్‌ల‌లో రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంలో బీజేపీ టాప్‌లో ఉంది. 2024 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వ‌ర‌కు రూ.12 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు పొలిటిక‌ల్ అడ్వ‌ర్ట‌యిజింగ్ ట్రాన్స్‌ప‌రెన్సీ రిపోర్టులో గూగుల్ తెలిపింది. మొత్తంగా కాషాయం పార్టీ 11,613 ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఇందులో 62.7 శాతం వీడియోలు, 37.3 శాతం ఫొటోలు ఉన్నాయి. బీజేపీ ఖ‌ర్చు చేసిన మొత్తం ప్ర‌క‌ట‌న‌ల వ్య‌యంలో సుమారు 40 శాతం ఈ రెండు ఆన్‌లైన్ మాధ్య‌మాల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేందుకు ఖ‌ర్చు చేసింది. 

దాదాపు రెండు నెలల వ్య‌వ‌ధిలో అన్ని పార్టీలు క‌లిపి 15,690 ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చాయి. దీనికోసం అన్ని పార్టీలు క‌లిపి రూ. 30.2 కోట్లు వెచ్చించాయ‌ని గూగుల్‌ పేర్కొంది. ఇందులో వీడియోల రూపంలో రూ. 24.40 కోట్లు, ఫొటోల రూపంలో రూ. 5.7 కోట్లు ఖ‌ర్చు చేశాయ‌ని తెలిపింది.  

అలాగే సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్ రూ. 8.41 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల కోసం వెచ్చించింది. ఆ త‌ర్వాత ఇండియా ప్యాక్ (పీఏసీ) క‌న్స‌ల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 3.19 కోట్లు యాడ్స్ కోసం ఖ‌ర్చు చేసింది. ఇక టీడీపీ ప్ర‌క‌ట‌న‌ల కోసం అక్ష‌రాల రూ. 2.07 కోట్లు వెచ్చించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీ సిమెంట్ లిమిటెడ్ రూ. 69.2 ల‌క్ష‌ల‌తో నాలుగో స్థానంలో ఉంటే, వే2న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ 61.9 ల‌క్ష‌లు ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖ‌ర్చు చేసి ఐదో స్థానంలో ఉంది. 

ఇక గూగుల్ యాడ్‌ పాల‌సీ ప్రకారం ప్రతి ప్రకటన కోసం ప్ర‌క‌ట‌న‌దారు తప్పనిసరిగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా  (ఈసీఐ) లేదా ఈసీఐ ద్వారా గుర్తింపు పొందిన ఎవరైనా జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ప్రీ-సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ప్రకటనకు ప్రీ-సర్టిఫికేట్‌ను సమర్పించే ముందు ప్రకటనదారు ముందుగా గూగుల్ ద్వారా ధ్రువీకరించబడాలి.

ఇక ఇదే కాల‌ప‌రిమితిలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఉత్త‌ర ప్ర‌దేశ్ రూ. 15.8 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖ‌ర్చు చేసి టాప్‌లో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో మ‌హారాష్ట్ర (రూ. 11.1 కోట్లు), బిహార్ (రూ. 8 కోట్లు) ఉన్నాయి.

More Telugu News