Daniel Kahneman: ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత కాహ్నేమాన్‌ కన్నుమూత

  • ఇజ్రాయెలీ అమెరికన్ శాస్త్రవేత్త కాహ్నేమాన్‌ కన్నుమూత
  • ఆయన మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడి సంతాపం
  • 2002లో కాహ్నేమాన్‌‌కు నోబెల్ బహుమతి ప్రదానం
Nobel winning economist Daniel Kahneman dies at 90

ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత డానియెల్ కాహ్నేమాన్‌ కన్నుమూశారు. ఇజ్రాయెల్ మూలాలున్న ఆయన.. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచప్రఖ్యాతి గడించారు. డానియెల్ కాహ్నేమాన్‌ మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు. తాము ఓ అత్యున్నత మేధావిని కోల్పోయామని వ్యాఖ్యానించారు. ఆయన పరిశోధన చరిత్రపుటల్లో నిలిచిపోతుందని అన్నారు. మనుషులు వాస్తవాలను ఎలా గ్రహిస్తారన్న విషయంలో ఆయన పరిశోధన విప్లవాత్మక మార్పులకు కారణమైందన్నారు. కాహ్నేమాన్‌ తదనంతరం కూడా ఆయన పరిశోధనలు మానవాళికి ఉపయోగపడతాయని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. 

కాహ్నేమాన్‌‌కు 2002లో నోబెల్ బహుమతి లభించింది. అనిశ్చిత పరిస్థితుల్లో మనుషులు నిర్ణయాలు తీసుకునే తీరును ఆర్థికశాస్త్రంతో అనుసంధానం చేస్తూ ఆయన చేసిన పరిశోధనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. మనిషి నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని ఎకనమిక్ థియరీ భావిస్తే, అనిశ్చిత పరిస్థితుల్లో మాత్రం మనుషులు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారని ఆయన తన పరిశోధనలతో రుజువు చేశారు. కాహ్నేమాన్‌ పలు యూనివర్శిటీల్లో అధ్యాపక, పరిశోధన బాధ్యతలు నిర్వర్తించారు.

More Telugu News