Pat Cummins: ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్‌లో చ‌క్క‌ర్లు కొట్టిన ప్యాట్ క‌మిన్స్‌.. బిర్యానీ సూప‌రంటూ కితాబు!

  • హైద‌రాబాదీ బిర్యానీకి ఆసీస్ క్రికెట‌ర్‌ ఫిదా
  • రుచిక‌ర‌మైన బిర్యానీతో క‌డుపు నిండిపోయింద‌ని వ్యాఖ్య 
  • మ‌రో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన అవ‌స‌రం లేదంటూ చ‌మ‌త్కారం
  • తొలిసారి భార‌త్‌కు వ‌చ్చిన త‌న ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌డం ప‌ట్ల క‌మిన్స్ హ‌ర్షం
Pat Cummins says Hyderabadi Biryani Super

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్న విష‌యం తెలిసిందే. త‌మ‌దైన ఆట తీరుతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది ఎస్ఆర్‌హెచ్‌. కొత్త కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ కెప్టెన్సీ కూడా ఆరెంజ్ ఆర్మీకి బాగా క‌లిసొచ్చింది. దీంతో హైద‌రాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మ్యాచులాడిన ఎస్ఆర్‌హెచ్ ఐదింటిలో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇదిలావుంటే.. ఎస్ఆర్‌హెచ్ సార‌ధి ప్యాట్ క‌మిన్స్ ప్ర‌స్తుతం భార‌త్‌కు తొలిసారి వ‌చ్చిన త‌న కుటుంబంతో క‌లిసి హైద‌రాబాద్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. ఈ క్ర‌మంలో క‌మిన్స్ ఫ్యామిలీ హైద‌రాబాదీ బిర్యానీ రుచి చూసింది. ఈ బిర్యానీకి క‌మిన్స్ ఫిదా అయ్యాడు. రుచిక‌ర‌మైన బిర్యానీతో క‌డుపు నిండిపోయింద‌ని, మ‌రో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన అవ‌స‌రం లేదంటూ చెప్పుకొచ్చాడు. 

తొలిసారి ఇండియాకు వ‌చ్చిన త‌న ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌డం ప‌ట్ల క‌మిన్స్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు టేస్టీ ఫుడ్ అందించిన హోట‌ల్‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. అలాగే త‌న కుటుంబంతో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా క‌మిన్స్ అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇక ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్ ఫ్రాంచైజీ యాజ‌మాన్యం మార్క్‌క్ర‌మ్‌ను త‌ప్పించి మ‌రి ప్యాట్ క‌మిన్స్‌కు జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. 

కాగా, ఆసీస్ జాతీయ జ‌ట్టుకు వ‌న్డే, టెస్టుల‌కు సార‌థ్యం వ‌హించిన అనుభ‌వం ఉన్న క‌మిన్స్.. ఐపీఎల్‌లో తొలిసారి టీ20లో జ‌ట్టు ప‌గ్గాలు అందుకుని అంద‌రి అంచ‌నాలను తారుమారు చేస్తూ ఎస్ఆర్‌హెచ్‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అటు కెప్టెన్సీతో పాటు ఇటు బౌల‌ర్‌గాను రాణిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. ఇక‌ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న‌ చివ‌రి మ్యాచులో ఆర్‌సీబీ చేతిలో సొంత మైదానంలో కంగుతిన్న విష‌యం తెలిసిందే. త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఆదివారం నాడు సీఎస్‌కేతో ఆడ‌నుంది.

More Telugu News