Luke Ronchi: పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ల్యూక్ రోంచి..!

  • న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న పీసీబీ
  • ప్ర‌స్తుతం కివీస్ సీనియ‌ర్ జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న ల్యూక్ రోంచి  
  • రోంచి కంటే ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్సాన్‌ను కోచ్ ప‌ద‌వి కోసం ఆడిగిన పీసీబీ
  • వాట్సాన్ కాద‌న‌డంతో ల్యూక్ రోంచిని ఒప్పించే ప‌నిలో పాక్ క్రికెట్ బోర్డు
New Zealand Player Luke Ronchi in Talks for Pakistan Head Coach Role says Reports

పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆట‌గాడు ల్యూక్ రోంచి ఎంపిక‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తాజాగా అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్ప‌టికే అత‌డితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కుముందు కోచ్ ప‌ద‌వుల్లో ఉన్న మిక్కీ ఆర్థ‌ర్‌, గ్రాంట్ బ్రాడ్‌బ‌ర్న్‌, ఆండ్రూ పుతిక్‌ల‌ను లాహోర్‌లోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) కి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది పీసీబీ. దాంతో ప్ర‌ధాన కోచ్ పోస్టు ఖాళీగా ఉంది. దీనికోస‌మే పీసీబీ న్యూజిలాండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ల్యూక్ రోంచిని సంప్ర‌దించింది. కాగా, రోంచి ప్ర‌స్తుతం కివీస్ సీనియ‌ర్ జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.  

42 ఏళ్ల ఈ మాజీ క్రికెట‌ర్ న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా రెండు జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న క్రికెట్ కెరీర్‌లో న్యూజిలాండ్ త‌ర‌ఫున 4 టెస్టులు, 85 వ‌న్డేలు, 33 టీ20లు ఆడాడు. అలాగే లీగ్ క్రికెట్‌లో భాగంగా ప‌లు దేశాల టోర్నీలలో ఆడిన అనుభ‌వం ఉంది. గ‌యానా అమెజాన్ వారియ‌ర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్‌, పెర్త్ స్కార్చ‌ర్స్ జ‌ట్ల‌కు ఆడాడు. 

ఇక పీసీబీ రోంచి కంటే ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్సాన్‌ను కోచ్ ప‌ద‌వి కోసం సంప్ర‌దించింది. కానీ, త‌న‌కు ఉన్న కామెంట‌రీ, కోచింగ్ క‌మిట్‌మెంట్ల కార‌ణంగా వాట్సాన్ సుముఖ‌త చూప‌లేదు. అత‌ని కంటే ముందు మైక్ హెస్స‌న్‌, డారెన్ సామీల‌ను కూడా హెడ్ కోసం పీసీబీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న‌ట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవేమీ కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ల్యూక్ రోంచిని ఒప్పించే ప‌నిలో పీసీబీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఒక‌సారి అత‌నితో ఇదే విష‌య‌మై మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

More Telugu News