Chandrababu: నువ్వెక్కడ పుట్టావ్... నేనెక్కడ పుట్టాను... నీకు నాకు సంబంధం ఏంటి?: చంద్రబాబు

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • 40 ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారని వెల్లడి
  • అడ్డం వస్తున్నారని భావిస్తే అడ్డంగా నరికేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యలు
  • గతంలో తాను కానీ, వైఎస్ కానీ నీచానికి దిగలేదని స్పష్టీకరణ
Chandrababu slams CM Jagan in Atmakur rally

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 40 ఏళ్లలో తనపై కేసు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఎవరైనా తమకు అడ్డం వస్తున్నారని భావిస్తే వారిని అడ్డంగా నరికేసే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది, ఇదేం రాజకీయమో తనకు అర్థం కావడంలేదని అన్నారు. 

"ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు... మేమంతా శత్రువులం అంట. నీకెవరయ్యా శత్రువులు... నువ్వెక్కడ పుట్టావ్... నేనెక్కడ పుట్టాను... నీకు నాకు సంబంధం ఏంటి? మీ నాన్న రాజకీయం చేశాడు, నేనూ రాజకీయం చేశాను, ఒకప్పుడు మేం మిత్రులం. రాజకీయపరంగా రెండు వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్ల పోరాడాం. ఎంత పోరాడినా... ఏ సమయంలోనూ నీచానికి దిగలేదు, ఒకరినొకరు గౌరవించుకున్నాం. అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు. 

గ్రామాల్లో ఎవరైనా టీడీపీ వాళ్లు గట్టిగా మాట్లాడితే వాళ్లకు పింఛను కట్, రేషన్ కట్... నీ భూమి కూడా లాగేసుకుంటాం... నీ ఇంటికి దారిలేదు అంటారా? నీకు శత్రువులా వాళ్లు? ఇది ప్రజాస్వామ్యమా? నార్త్ కొరియాలో ఒకాయన ఉన్నాడు... ఆయన పేరు కిమ్. ఆ కిమ్ ఎవరైనా నవ్వితే కొడతాడు. ఇక్కడ కూడా ఒకాయన ఉన్నాడు... మీరు ఏడిస్తే ఆయన కొడతాడు, ఆయన కొడుతున్నా మీరు నవ్వుతూనే ఉండాలి. ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం? 

మళ్లీ బాదుడులేని రాష్ట్రం కావాలంటే కూటమి గెలవాలి. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ప్రభుత్వం రావాలంటే వాళ్లిద్దరూ గెలవాలి. ఇవాళ కూడా జగన్ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగాల గురించి చెప్పలేకపోయాడు. ఇప్పుడు మేం మరోసారి చెబుతున్నాం... మేం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం.  

జగన్ అంటున్నాడు... సంపద లేదట, నిరుద్యోగ భృతి ఇవ్వలేడట... నువ్వు తప్పుకో... మేం చెప్పినవన్నీ చేసి చూపించడమే కాదు చరిత్రను తిరగరాస్తాం... అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. 

అందుకే యువతకు చెబుతున్నా... సైకిల్ ఎక్కండి... జనసేన గ్లాసు పట్టుకోండి, కమలం పువ్వును కూడా ఉంచుకోండి. అంగన్వాడీలకు, హోంగార్డులకు న్యాయం చేస్తాం. టీచర్లను ఆదుకుంటాం, ఇంటివద్దనే పెన్షన్లు అందిస్తాం. మన సూపర్ సిక్స్ అదుర్స్... కానీ జగన్ నవరత్నాలు నవమోసాలుగా తయారయ్యాయి... మన సూపర్ సిక్స్ ముందు వెలవెలబోతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ ను చూసి పరిశ్రమలు పారిపోతాయి... అభివృద్ధి ఆగిపోతుంది... చివరికి ఇంటింటికీ గంజాయి డోర్ డెలివరీ చేస్తాడు! 

జగన్ నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే కొనేవాడు లేడు, ఈ దుర్మార్గుడ్ని ఎవరైనా కొంటారా? మీ నాన్నే నిన్ను చూసి భయపడిపోయి బెంగళూరు పంపించాడు. తల్లికి అన్నం పెట్టనివాడు ప్రజలకు ఏమైనా చేస్తాడా? తల్లిని గౌరవించని వాడు సమాజాన్ని గౌరవిస్తాడా? 

ఆత్మకూరులో పేరుకే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే. పెత్తనం మరొకరిది. కాంట్రాక్టులు, ఇసుక దందాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, లే అవుట్లు, మైనింగ్ డీల్స్... ఇలా అన్నింట్లోనూ దోపిడీ!" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News