US Bridge Collapse: అమెరికాలో ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి ఘటనలో ఆరుగురి మృతి

6 Dead After US Bridge Collapse on Indian Crew dealing Ship

  • బాల్టిమోర్‌లో కూలిన ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ’ బ్రిడ్జి
  • మరమ్మతు పనులు నిర్వహిస్తున్న నౌకపై పడిన బ్రిడ్జి
  • నీటిలో పడి ఆరుగురు మృత్యువాత
  • నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమం 

అమెరికాలోని బాల్టిమోర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పటాప్ స్కో నదిపై ఉన్న ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ’ బ్రిడ్జి కూలి ‘డాలీ’ అనే కంటెయినర్ షిప్‌పై పడింది. ఒక్క క్షణంపాటు విద్యుత్ పోవడంతో షిప్ ముందుకు వెళ్లే దిశపై నియంత్రణ తప్పి దూసుకెళ్లి బ్రిడ్జి ఐరన్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో నౌక ప్రమాద సిగ్నల్స్ కూడా ఇచ్చింది. స్పందించిన సిబ్బంది ఎంత ప్రయత్నించినా షిప్ నియంత్రణలోకి రాలేదు. చివరి ప్రయత్నంగా లంగర్లను ఉయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు. దూసుకెళ్లి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొంది.

బ్రిడ్జి మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కూలిన బ్రిడ్జి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మరమ్మతు పనులు చేపడుతున్న ఆరుగురు వ్యక్తులు నీటిలో పడిపోయారు. వారంతా చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. అప్పటికే చాలా సమయం గడిచిపోవడం, నీటి ఉష్ణోగ్రత, నీటి ప్రవాహ పరిస్థితుల దృష్ట్యా వారు బతికే అవకాశం లేకపోవడంతో గాలింపు చర్యలను కూడా నిలిపివేశామని యుఎస్ కోస్ట్ గార్డ్ అధికారి షానన్ గిల్రెత్ తెలిపారు. కాగా నౌక సిబ్బంది అందరూ భారతీయులేనని, వారంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు వివరించారు.

ఈ ఘోర ప్రమాదంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ ప్రమాదం దురదృష్టకరమని వ్యాఖ్యనించింది. ప్రభావిత వ్యక్తుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ప్రమాదానికి గురైన భారతీయ పౌరుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్‌ను కూడా షేర్ చేసింది.

US Bridge Collapse
Baltimore
Francis Scott Key Bridge
Dali
  • Loading...

More Telugu News