IPL Betting: ఐపీఎల్ బెట్టింగుల్లో ప్రభుత్వోద్యోగికి రూ.1.5 కోట్లకుపైగా నష్టం.. 23 ఏళ్ల వివాహిత ఆత్మహత్య

After Karnataka Man Loses 1 Crore In IPL Betting Wife Dies By Suicide
  • కర్ణాటకలోని చిత్రదుర్గలో దారుణం
  • అప్పులు చేసి ఐపీఎల్ బెట్టింగుల్లో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్
  • రూ.కోటి అప్పు పేరుకుపోవడంతో డబ్బులిచ్చిన వారి నుంచి వేధింపులు
  • ఈ వేధింపులు తాళలేక అతడి భార్య ఆత్మహత్య
క్రికెట్ బెట్టింగుల వ్యసనం ఓ ప్రభుత్వోద్యోగి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అప్పుల బాధ తాళలేక అతడి భార్య 23 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. 

దర్శన్, రంజితలకు 2020లో వివాహం జరిగింది. రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో దర్శన్ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల బెట్టింగులకు అలవాటు పడ్డ దర్శన్ భారీగా నష్టపోయాడు. నష్టం వచ్చిన ప్రతిసారీ అప్పుచేసి మరీ బెట్టింగులకు దిగడంతో రూ. కోటి మేర అప్పులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోయిన రంజిత ఇటీవల చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

పెళ్లైన ఏడాదికి తన భర్త బెట్టింగుల వ్యసనం రంజితకు తెలిసిందని ఆమె తండ్రి వెంకటేశ్ మీడియాకు తెలిపారు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో రుణాలిచ్చిన 13 మంది పేర్లు ప్రస్తావించారు. బెట్టింగుల్లో సులువుగా డబ్బులు సంపాదించొచ్చంటూ నిందితులు తన అల్లుడిని ఉచ్చులోకి దింపారని ఆరోపించారు. 

‘‘అతడికి బెట్టింగులు అంటే ఇష్టం లేదు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇదే సరైన మార్గం అంటూ నిందితులే అతడిని బలవంతంగా ఉచ్చులోకి దింపారు. బ్లాంక్ చెక్కు షూరిటీగా తీసుకుని బెట్టింగులకు కావాల్సిన డబ్బులు ఇచ్చారు’’ అని ఆయన ఆరోపించారు. 

మీడియా కథనాల ప్రకారం, దర్శన్ మొత్తం రూ1.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. వాటిలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించగా ప్రస్తుతం మరో రూ. 84 లక్షలు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. 
IPL Betting
Karnataka
Wife suicide
Crime News

More Telugu News