Vemuri Anand Surya: వైసీపీ నేతలు ఆలయాలకు భక్తితో వస్తున్నారా, దాడులు చేయడానికి వస్తున్నారా?: వేమూరి ఆనంద్ సూర్య ఫైర్

  • కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడి చేసిన వైసీపీ నేత సిరియాల చంద్రరావు
  • ఓ అర్చకుడ్ని కాలితో తన్నిన వైనం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్
  • వైసీపీ నేతలు పాలకులా, నరరూప రాక్షసులా? అంటూ ఆగ్రహం
Vemuri Anand Surya reacts on YCP leader attacked priests

కాకినాడ శివాలయంలో నిన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు అర్చకులపై దాడి చేయడం తెలిసిందే. తన పేరిట సరిగా పూజ చేయడం లేదంటూ చంద్రరావు ఓ అర్చకుడ్ని చెంప దెబ్బ కొట్టి, కాలితో తన్నారు. అడ్డుకోవడానికి వచ్చిన మరో అర్చకుడ్ని కూడా చెంపపై కొట్టారు. 

దీనిపై టీడీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఘాటుగా స్పందించారు.  వైసీపీ నేతలు ఆలయాలకు భక్తితో వస్తున్నారా, దాడుల చేయడానికి వస్తున్నారా? అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అర్చకులపైనా, పురోహితులపైనా దాడులకు తెగబడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"దేవుని సన్నిధిలో అందరూ సమానమేనన్న ఇంగితం కూడా లేకుండా సిరియాల చంద్రరావు దాడికి పాల్పడ్డాడు. నువ్వు ఏ భక్తితో వచ్చావయ్యా... బ్రాహ్మణులను కొట్టి, తిట్టి, కాలితో తన్నావు... నీకు పుణ్యం ఎక్కడ్నించి వస్తుంది? నువ్వు పూజలు చేయడం ఎందుకు? మీరు చెప్పినట్టు చేయకపోతే కొడతారా? 

ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం. అర్చకులకు వేతనాల పెంపు లేదు. అర్చకులను ఆదుకోకపోగా వారిపై కిరాతకంగా దాడులు చేస్తారా? కాలితో తన్నడం, బూతులు తిట్టడం వంటి చర్యలతో అపచారాలకు పాల్పడుతున్నారు. 

గతంలో కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఆలయ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఇతర వైసీపీ నేతలు అర్చకులను చెర్నాకోలతో కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. నరసరావుపేట వద్ద కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయంలో ఓ వైసీపీ నేత తనకు మర్యాదలు జరగలేదని అర్చకుడిపై దాడి చేశాడు. ఎంత బాధాకరం! వీళ్లు పాలకులా, నరరూప రాక్షసులా?" అంటూ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు.

More Telugu News