Pawan Kalyan: జనసేన పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చిన పవన్ కల్యాణ్

  • సొంత పార్టీకి భారీ విరాళం అందించిన జనసేనాని
  • విరాళం చెక్కులను జనసేన కోశాధికారి ఏవీ రత్నంకు అందించిన పవన్
  • ఈ డబ్బు ఎన్నికల ప్రచార ఖర్చులకు ఉపయోగపడుతుందని వెల్లడి
Pawan Kalyan donates Rs 10 cr for Janasena Party

జనసేనాని పవన్ కల్యాణ్ సొంత పార్టీకి భారీ విరాళం అందించారు. జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, నాడు స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బు వెచ్చించిన తీరు గొప్పది అని కొనియాడారు. 

"ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడం కోసం జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లు అందజేస్తున్నాను. ఈ నగదు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. 

జనసేన పార్టీ కోసం ఓ సగటు కూలీ తన చిన్నపాటి సంపాదనలో రూ.100 పక్కనబెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారు. ఓ బేల్దారీ మేస్త్రి రూ. లక్ష విరాళం అందించారు. దాంతోపాటే, పింఛను డబ్బులో కొంత మొత్తాన్ని పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. 

అలాంటి వారి స్ఫూర్తితో నేను సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా వద్ద ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను" అని తెలిపారు.

More Telugu News