Revanth Reddy: తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy in Chevella lok sabha meeting
  • తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయస్థాయి సభ ఉంటుందని వెల్లడి
  • కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయస్థాయిలో గ్యారెంటీల ప్రకటన ఉంటుందన్న సీఎం
  • లోక్ సభ ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న రేవంత్ రెడ్డి
తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయస్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయస్థాయిలో గ్యారెంటీల ప్రకటన ఉంటుందన్నారు.

తుక్కుగూడ సభలోనే జాతీయస్థాయి గ్యారెంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందన్నారు.

ప్రధాని మోదీ తన పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్‌కు బుల్లెట్ రైలు తీసుకువెళ్తున్న మోదీ వికారాబాద్‌కు కనీసం ఎంఎంటీఎస్ కూడా తీసుకు రాలేదని విమర్శించారు. సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసిన మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్‌కు మాత్రం నిధులివ్వలేదన్నారు. అసలు ఏం చూసి మోదీకి ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
Revanth Reddy
Congress
Telangana
Lok Sabha Polls

More Telugu News