Daggubati Purandeswari: మూడు పార్టీల జెండాలు వేరైనా... జగన్ ను గద్దె దించడం ఒక్కటే అజెండా: పురందేశ్వరి

Purandeswari comments on three parties alliance
  • నేడు ఏపీ బీజేపీలో పలువురి చేరికలు 
  • మూడు పార్టీల కలయిక చారిత్రాత్మకం అని పురందేశ్వరి వ్యాఖ్యలు
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామరాజ్యం ఏర్పడుతుందని వెల్లడి
విజయవాడలో ఇవాళ పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగిస్తూ... వైసీపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలన్నా, సీఎం జగన్ ను గద్దె దించాలన్నా మూడు పార్టీలు కలవాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని, ఈ కూటమి త్రివేణి సంగమం వంటిదని అభివర్ణించారు. మూడు పార్టీల జెండాలు వేరైనా, అజెండా ఒక్కటేనని స్పష్టం చేశారు. 

బీజేపీ మద్దతుదారులు కూటమిలోని ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఏపీలో రామరాజ్యం సాకారమవుతుందని అన్నారు. 

"ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లాలని మా అధిష్ఠానం నిర్ణయించింది. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడమే కూటమి లక్ష్యం. అందుకే పొత్తు అనివార్యం అని మా పార్టీ పెద్దలు భావించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తన అధీనంలోకి తీసుకుంది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారు. అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేశారు. సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాశారా? అని ఒక వైసీపీ నేత అంటున్నాడు. 

జగన్... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు... వారికి ఆయన ఏమైనా న్యాయం చేశాడా?" అని పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
Daggubati Purandeswari
BJP
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News