Smriti Irani: జైరాం రమేశ్‌పై స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం

  • దేశానికి నిజమైన వారసులమని చెప్పుకుంటున్న వంశపాలకులు దేశ సంపదను దోచుకున్నారని విమర్శ
  • పార్టీ కనిపించకుండా పోయినా వారి అనుచరులు అబద్దాలు చెబుతూనే ఉన్నారన్న కేంద్రమంత్రి
  • ఎన్డీయే వచ్చాక మహిళల కోసం 40 ప్రాజెక్టులను రూపొందించినట్లు వెల్లడి
Smrithi Irani fires at Jairam Ramesh

కాంగ్రెస్ పార్టీ పతనమైనప్పటికీ గాంధీ కుటుంబం అనుచరులు మాత్రం నిత్యం వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేస్తోన్న నారీశక్తి నినాదాలు ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్పందించారు. చాలా కాలం నుంచి దేశానికి నిజమైన వారసులమని చెప్పుకుంటున్న వంశపాలకులు దేశ సంపదను దోచుకున్నారని విమర్శించారు. పార్టీ కనిపించకుండా పోయినప్పటికీ వారి అనుచరులు మాత్రం అబద్ధాలు చెబుతూనే ఉన్నారని ఆరోపించారు.

మహిళా సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను అణగదొక్కేందుకు గణాంకాలను తారుమారు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె... జైరాం రమేశ్‌ను గాంధీల సభలోని వ్యక్తిగా అభివర్ణించారు. యూపీఏ హయాంలో మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక 40 ప్రాజెక్టులను రూపొందించినట్లు చెప్పారు. 2023-24 నాటికి రూ.7,212 కోట్లను కేటాయించామని, ఇందులో 75 శాతం నిధులను ఖర్చు చేసినట్లు చెప్పారు.

నిర్భయ కాల్ సెంటర్లు, వన్ స్టాప్ సెంటర్లు, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు నిరంతరాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు గౌరవవేతనంతో పాటు అవరమైన డేటా అప్ డేట్ చేయడానికి రూ.2,000 కోట్లు అదనంగా కేటాయించినట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం లేదన్నారు.

More Telugu News