Viral Videos: హోలీ వేడుకల్లో అమ్మాయిల వికృత చేష్టలు.. రూ. 33 వేల ఫైన్.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘటన
  • వైరల్ అయిన వీడియోపై తీవ్రంగా స్పందించిన పోలీసులు
  • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ భారీ ఫైన్
  • ఫైన్‌తో సరిపెట్టవద్దంటున్న నెటిజన్లు
  • మరో ఘటనలో రంగులు పూస్తూ విన్యాసం చేయబోయి బైక్‌పై నుంచి కిందపడిన యువతి
Man Driving Scooter And 2 Girls Playing Holi On It In Noida

దేశమంతా నిన్న హోలీ వేడుకల్లో మునిగిపోయింది. రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇద్దరు యువతులు బైక్ పై వెళ్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. హోలీ వేడుకలను రీల్స్‌లో బందిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు స్కూటీ నడుపుతుండగా, వెనక ఇద్దరు యువతులు హోలీ రంగులు పూసుకొని ఎదురెదురుగా కూర్చున్నారు. ‘అంగ్ లగా దే’ సినిమాలోని ‘గోలియా కీ రాసలీలా రామ్ లీలా’ పాట బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే, వారు ఆ పాటకు నడిరోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి హావభావాలు జుగుప్సాకరంగా ఉన్నాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు తీవ్రంగా స్పందించారు. వారికి రూ. 33 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈ-చలానా జారీచేస్తూ దానిని తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొందరేమో ఫైన్‌తో సరిపెట్టవద్దని, యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, వైరల్ అవుతున్న మరో వీడియోలో ఓ యువతి ఇలానే స్కూటర్ నడుపుతున్న యువకుడికి రంగులు పూసి.. వెనక చేతులు చాచి సీటుపై విన్యాసాలు చేయబోయింది. ఆ తర్వాత పట్టుతప్పి కిందపడింది.

More Telugu News