Mohammed Shami: ధోనీ ఎప్ప‌టికీ ధోనీనే.. హార్దిక్ పాండ్యాకు ష‌మీ చుర‌క‌లు..!

  • గుజ‌రాత్ టైటాన్స్ తో ముంబై ఓడిపోవ‌డంతో పాండ్యాపై విమ‌ర్శ‌లు  
  • పాండ్యా ఏడ‌వ స్థానంలో బ్యాటింగుకి రావడాన్ని తప్పుబట్టిన షమీ   
  • హార్దిక్ పాండ్యా.. ధోనీ అవ్వాల‌నుకుంటున్నాడ‌ని ష‌మీ వ్యంగ్యాస్త్రాలు
You cannot match MS Dhoni Mohammed Shami at Hardik Pandya decisions during GT vs MI clash

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. రోహిత్ శ‌ర్మ నుంచి కెప్టెన్సీ తీసుకోవ‌డం ప‌ట్ల ఇప్ప‌టికే అత‌నిపై భారీగా వ్య‌తిరేక‌త వ‌స్తున్న విష‌యం తెలిసిందే. హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు క్రికెట్ అభిమానులు కూడా ఈ విష‌యాన్ని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ త‌రుణంలో ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) తో తొలి మ్యాచులో ముంబై ఓడిపోవ‌డం పాండ్యాపై విమ‌ర్శ‌ల‌ను మ‌రింత పెంచింది. ఈ మ్యాచులో సార‌ధిగా అత‌డు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ముంబై ప‌రాజ‌యానికి కార‌ణ‌మ‌ని ఎంఐ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కూడా చేరాడు. 'హార్దిక్ పాండ్యా.. ధోనీ అవ్వాల‌నుకుంటున్నాడ‌ని' చుర‌క‌లు అంటించాడు.     

గుజ‌రాత్‌తో మ్యాచులో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విష‌య‌మై తాజాగా ష‌మీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 'ప్ర‌తి జ‌ట్టు నాయ‌కుడికి వారికంటూ ప్ర‌త్యేక ఆలోచ‌న ధోర‌ణి ఉంటుంది. దాన్ని బ‌ట్టి వారు త‌మ నైపుణ్యంతో మైదానంలో నిర్ణ‌యాలు తీసుకుంటారు. ధోనీ ఎప్ప‌టికీ ధోనీనే. అత‌డిని ఎవ‌రూ మ్యాచ్ చేయ‌లేరు' అని ష‌మీ చెప్పుకొచ్చాడు. కాగా, ష‌మీ గ‌త రెండు సీజ‌న్లు గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన‌ విష‌యం తెలిసిందే. ఈ రెండు సీజ‌న్లు హార్దిక్ కెప్టెన్సీలో ఆడాడు. కానీ, ఈసారి గాయం కార‌ణంగా ఐపీఎల్ 2024 కు దూరం అయ్యాడు.

మ‌హ్మ‌ద్ ష‌మీ ఇంకా మాట్లాడుతూ.. "ధోనీలా ఏడ‌వ స్థానంలో బ్యాటింగ్‌కి వ‌చ్చి మ్యాచును ముగించ‌డం అంద‌రికీ సాధ్యం కాదు. ధోనీ ఎప్ప‌టికీ ధోనీనే. అత‌డిలా ఎవ‌రూ స‌రితూగ‌రు. ప్ర‌తి ఒక్క‌రికి ఒక మైండ్‌సెట్ ఉంటుంది. అది ధోనీ అయినా లేదా కోహ్లీ అయినా. నీ నైపుణ్యాన్ని బ‌ట్టి గేమ్‌లో ఉండాలి. గ‌త రెండు సీజ‌న్ల‌లో హార్దిక్ పాండ్యా 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మంచి ఫ‌లితాలు రాబట్టాడు. అలాంట‌ప్పుడు అదే స్థానంలో కొన‌సాగాలి. అలాగే చాలాసార్లు ఐదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేశాడు. కానీ, ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఏడ‌వ స్థానంలో దిగాడు. అలా వ‌స్తే త‌న‌పై తానే ఒత్తిడి పెంచుకున్న‌ట్ల‌వుతుంది" అని ష‌మీ చుర‌క‌లు అంటించాడు.   

ఇక గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 169 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబై 162 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో ముంబైకి 43 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఈ స‌మ‌యంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ వెంట‌వెంట‌నే పెవిలియ‌న్ చేర‌డంతో ముంబైకి ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. కాగా, ముంబై తన త‌ర్వాతి మ్యాచ్‌ను బుధ‌వారం (మార్చి 27న‌) హైదరాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో ఆడ‌నుంది.

More Telugu News