Kim Jong Un: చర్చలకు రావాలంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ ను ఆహ్వానించిన జపాన్

  • ప్రపంచ దేశాలకు కొరకరానికొయ్యగా కిమ్ జాంగ్  ఉన్
  • కిమ్ కు స్నేహ హస్తం చాచిన జపాన్
  • చర్చలకు రావాలంటూ తన సోదరుడికి పిలుపు అందిందన్న కిమ్ సోదరి
  • జపాన్ ప్రభుత్వ విధానాలు మారితేనే చర్చలకు అవకాశం ఉంటుందన్న యో జోంగ్
Japan invites North Korea supreme Kim Jong Un

అణ్వస్త్ర శక్తిగా ఎదిగి, అగ్రరాజ్యాలను తన జోలికి రాకుండా నియంత్రించాలని భావిస్తున్న ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కు జపాన్ నుంచి చర్చల ప్రతిపాదన వచ్చింది. ఈ విషయాన్ని కిమ్ సోదరి యో జోంగ్ వెల్లడించారు. చర్చలకు రావాలంటూ తన సోదరుడ్ని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానించారని ఆమె తెలిపారు. 

అయితే, జపాన్ ప్రభుత్వ విధానాలు మారితేనే ఈ చర్చలు సాకారం అవుతాయని స్పష్టం చేశారు. జపాన్ తన వైఖరి మార్చుకోనంత వరకు ఎలాంటి సమావేశాలకు అవకాశం లేదని అన్నారు. 

ఉత్తర కొరియా, జపాన్ మధ్య సరికొత్త అధ్యాయం ప్రారంభం కావాలంటే... జపాన్ తీసుకునే రాజకీయ నిర్ణయమే కీలకమని యో జోంగ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో సుస్థిరత నెలకొనాలని జపాన్ చిత్తశుద్ధితో కోరుకున్నప్పుడే ఇరుదేశాల మధ్య చర్చలు కార్యరూపం దాల్చుతాయని వివరించారు. 

70, 80వ దశకాల్లో ఉత్తర కొరియా తన ఏజెంట్లతో జపాన్ వాసులను కిడ్నాప్ చేయించి, వారితో తమ సీక్రెట్ ఏజెంట్లకు జపాన్ భాష, ఆచార వ్యవహారాల్లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అంగీకరించింది. 

అయితే, తాజా సమావేశాలు, చర్చల ప్రతిపాదనలతో ఈ అపహరణల అంశాన్ని ముడివేయరాదని కిమ్ సోదరి యో జోంగ్ స్పష్టం చేశారు. జపాన్ ఇప్పటికీ అపహరణల అంశంపై గట్టి పట్టుదలతో ఉంటే ఇరుదేశాల మధ్య చర్చలకు అది ఆటంకంగా మారే అవకాశం ఉందని అన్నారు.

More Telugu News