Chandrababu: నిజమైన దేవతలు మీరు: కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • కుప్పం వస్తే తనకు ఫుల్ జోష్ వస్తుందని వెల్లడి
  • ఇక్కడి ప్రజలు నిస్వార్థపరులని కితాబు
  • మహిళలందరిలో శక్తి ఉంటుందని, దాన్ని వెలికితీయాలని వ్యాఖ్యలు
Chandrababu held meeting with women in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల మంచి మనసు కారణంగానే, తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు. 

ఇక్కడి ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశం అని చంద్రబాబు వివరించారు. అందుకే తాను కుప్పం వస్తే బాగా చార్జింగ్ అవుతానని, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చా

గత 35 ఏళ్లుగా ఏడు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ పరంపరను రెన్యువల్ చేయించుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. మళ్లీ గెలిపించమని మీ ఆశీస్సులు కోరుతున్నాను. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇక్కడ్నించే శ్రీకారం చుడుతున్నాను. 

అందుకే ఇవాళ మొదట వినాయకుడి ఆలయానికి వెళ్లాను. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ తర్వాత కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లాను. మా ఆడబిడ్డలు ఆరాధించే కన్యకాపరమేశ్వరి ఆలయానికి వారి ప్రతినిధిగా వెళ్లి పూజలు చేశాను. ఆ తల్లి దీవెనలు తీసుకున్నాను. నిజమైన దేవతలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరగాల్సి అవసరం ఉంది.

ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేస్తా

రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు మాటిస్తున్నానని, ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేసే బాధ్యత నాది. జలగ చేసే పని... రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం! నేను అలా కాదు... సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచుతాను... ఆ డబ్బును మీకే పంచుతాను... ఆ డబ్బుతో రూ.15తో రూ.100 సంపాదించే మార్గం నేను నేర్పిస్తాను... రూ.100 నుంచి రూ.1000... రూ.1000 నుంచి రూ. పది వేలు సంపాదించే మార్గం నేను చూపిస్తా.

నేను ఎక్కడో పుట్టలేదు

నేను ఎక్కడో పుట్టలేదు... ఇక్కడే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా అమ్మకు చదువు రాదు. మా నాన్న ఒక రైతు. ఎన్టీఆర్ కూడా ఒక సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. మహాత్మాగాంధీ కూడా అంతే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పారు... ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటూ పైకొచ్చిన వ్యక్తి ఆయన. మీ అందరిలోనూ శక్తి ఉంటుంది... దాన్ని వెలికితీయాలన్నదే నా ఆలోచన. మహిళలను అసాధారణ శక్తిమంతులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. 

రెండు ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు

కుప్పంలో ఇంటికి రెండు ఆవులు ఇస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు 4 లక్షల లీటర్ల పాలసేకరణ సాధ్యమైంది. స్కూలుకు వెళ్లే ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఇచ్చాం. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా నియమించాం. ఏపీ మహిళలు ప్రపంచానికే ఆదర్శం కావాలన్నదే తన ఆశయం.... అని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News