Gujarat Titans: ముంబై ఇండియన్స్‌పై బోణీ కొట్టిన గుజరాత్ టైటాన్స్

  • ఉత్కంఠభరిత పోరులో ముంబైపై 6 పరుగుల తేడాతో గుజరాత్ విజయం
  • అద్భుతంగా రాణించిన బౌలర్లు
  • చివరి ఓవర్ వేసిన గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చిన ఉమేశ్ యాదవ్
Gujarat Titans beats Mumbai Indians In IPL 2024

ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో వికెట్లు తీసి గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నిజానికి రోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ మూడో వికెట్‌కు ఏకంగా 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై విజయం సునాయాసంగా మారింది. గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. చివరి 3 ఓవర్లలో ఆట గుజరాత్ టైటాన్స్ వైపు తిరిగింది. 18వ ఓవర్‌ వేసిన మోహిత్ శర్మ కీలక బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌‌ను మలుపుతిప్పాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్‌లో 19 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మొదటి బంతిని సిక్సర్ బాదాడు. రెండో బంతిని ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతుల్లో హార్దిక్, పియూష్ చావ్లాలను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. చివరి 2 బంతుల్లో 9 పరుగులు అవసరమవ్వగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఓడిపోయింది.

ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (25), నమన్ ధీర్(20), హార్దిక్ పాండ్యా (11), టిమ్ డేవిడ్(11), షామ్స్ ములానీ(1 నాటౌట్), పీయూష్ చావ్లా(0), గెరాల్డ్ కోయెట్జీ(1), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్), చొప్పున పరుగులు చేశారు. ఇక గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మొహిత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. రవి శ్రీనివాసన్ సాయి కిశోర్‌కి ఒక వికెట్ పడింది.

కాగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక గాయం కారణంగా 2023 ఎడిషన్‌ ఐపీఎల్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఫర్వాలేదనిపించాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు.

More Telugu News