BJP: ఏపీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రఘురామకు మొండిచేయి

  • ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు
  • 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో కమలనాథుల పోటీ
  • నేడు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్
  • నరసాపురం టికెట్ ఇస్తారని ఆశించిన రఘురామ
  • భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చిన బీజేపీ
BJP announces Lok Sabha candidates in AP

ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ హైకమాండ్ ఏపీలో పోటీ చేసే తమ లోక్ సభ అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేసింది. 

అరకు (ఎస్టీ) నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాద్ రావు, రాజంపేట నుంచి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. 

కాగా, నరసాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశకు గురయ్యారు. నరసాపురం ఎంపీ టికెట్ ను బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఇచ్చింది. ఇక, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరికి అధిష్ఠానం రాజమండ్రి సీటు కేటాయించింది. సీఎం రమేశ్ అనకాపల్లి సీటు దక్కించుకున్నారు. 

ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి లోక్ సభ బరిలో దిగుతున్నారు. ఆయనకు అధిష్ఠానం రాజంపేట ఎంపీ స్థానం కేటాయించింది.

More Telugu News