Atchannaidu: లోకేశ్ వాహనాలనే తనఖీ చేయాలన్న ఆదేశాలు ఏమైనా ఉన్నాయా?: అచ్చెన్నాయుడు

  • ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలు
  • మూడ్రోజుల వ్యవధిలో లోకేశ్ వాహనాలను నాలుగుసార్లు తనిఖీ చేశారన్న అచ్చెన్న
  • లోకేశ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టుందని వ్యాఖ్యలు
Atchannaidu questions state govt

ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం, గత మూడు రోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ ని పోలీసులు నాలుగుసార్లు తనిఖీ చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. 

ఎన్నికల కోడ్ కారణంగానే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ లోకేశ్ వాహనాలనే తనిఖీ చేయాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పదే పదే తనిఖీ చేయడం చూస్తుంటే లోకేశ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోందని అన్నారు. 

మార్చి 20న ఉదయం 8 గంటలకు, మార్చి 23న ఉదయం 8 గంటలకు, ఇవాళ ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు లోకేశ్ కాన్వాయ్ ఆపిన పోలీసులు తనిఖీలు చేశారని అచ్చెన్నాయుడు వివరించారు.

వైసీపీ ముఖ్య నేతల కాన్వాయ్ లు ఎందుకు తనిఖీలు చేయడంలేదని నిలదీశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇప్పటికీ జగన్ బొమ్మలు మంగళగిరిలో ఉన్నా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం మానుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

More Telugu News