Devineni Uma: ఎన్నికల కోడ్ కు ఒక్కరోజు ముందు 17 వేల ఎకరాల పందేరం: దేవినేని ఉమ

  • హడావుడిగా 4 జీవోలు జారీ చేసిన జగన్ సర్కారు
  • అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూముల ధారాదత్తం
  • సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ నేత దేవినేని ఉమ
TDP Leader Devineni Uma Tweet

ఎన్నికల ముందు జగన్ సర్కారు విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిందంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వెళ్లగొట్టారని ఆరోపించారు. యాజమాన్యాలను వేధింపులకు గురిచేసి ఉన్న కంపెనీలను తరిమేశారని విమర్శించారు. అస్మదీయ కంపెనీలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకే లీజుకిచ్చారని, అదీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు రోజు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 

కేవలం ఒక్క కంపెనీకే ఐదేళ్లలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు రోజు ప్రభుత్వం హడావుడిగా నాలుగు జీవోలు జారీ చేసిందని చెప్పారు. ఇండోసోల్ అనే కంపెనీకి ఒక్కరోజే ఏకంగా 17 వేల ఎకరాలను లీజుకు ఇచ్చారని, ఎకరాకు ఏడాదికి రూ.31 వేలకు ఇచ్చారని దేవినేని ఉమ పేర్కొన్నారు. ఒక ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీకి రూ.47 వేల కోట్ల విద్యుత్ రాయితీ కల్పించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి అడ్డదారుల్లో సొంత సంపదగా మార్చుకుంటున్నాడని సీఎం జగన్ పై దేవినేని మండిపడ్డారు.

More Telugu News