Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా ఇచ్చిన తొలి ఆదేశం ఇదే!

  • దేశరాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి తొలి ఆదేశం జారీ చేసిన కేజ్రీవాల్
  • ఢిల్లీ మంత్రి ఆతిషీ ద్వారా జైలు నుంచే ఆదేశాలు జారీ
  • జైల్లో ఉండగా ప్రభుత్వ నిర్వహణ అంత సులభం కాదని చెబుతున్న న్యాయ నిపుణులు
Arvind Kejriwal Issues His 1st Order From Enforcement Directorate Lock Up

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ఆదేశాన్ని జారీ చేశారు. దేశరాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఢిల్లీ మంత్రి ఆతిషీ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేశారు. 

మద్యం విధానంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సీఎం కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు వారం పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన కేజ్రీవాల్..బీజేపీపై దుమ్మెత్తిపోశారు. రాజకీయ లక్ష్యాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారని మండిపడ్డారు. 

మరోవైపు, కేజ్రీవాల్ జైల్లో ఉన్నా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ స్పష్టం చేసింది. దీంతో, జైల్లోని వ్యక్తి సీఎం బాధ్యతలు నిర్వర్తించవచ్చా? అన్న చర్చ మొదలైంది. న్యాయనిపుణుల ప్రకారం, విచారణ ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న వ్యక్తి సీఎం బాధ్యతలు నిర్వహించకూడదన్న చట్టం ఏదీ లేదు. అయితే, కఠినమైన జైలు నిబంధనలు ఇందుకు అడ్డంకిగా మారొచ్చని తెలుస్తోంది. 

జైలు నిబంధనల ప్రకారం, ఖైదీతో వారానికి రెండు సార్లు మాత్రమే మిలాఖత్ అయ్యేందుకు అనుమతి ఉంటుంది. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, ఇతర సన్నిహితులు మాత్రమే ఖైదీని కలిసేందుకు జైలు నిబంధనలు అనుమతిస్తాయి. కాబట్టి, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదని తీహార్ జైలు మాజీ న్యాయ అధికారి ఒకరు తెలిపారు. 

అయితే, కేజ్రీవాల్‌కు హౌస్ అరెస్టు విధిస్తే మాత్రం ప్రభుత్వం నడపడం కాస్తంత సులభం అవుతుందన్నారు. ఇందుకు లెఫ్టెనెంట్ గవర్నర్ అనుమతి అవసరమని అన్నారు. ఏ భవంతినైనా జైలుగా ప్రకటించే అధికారం గవర్నర్‌కు ఉందని సదరు మాజీ అధికారి చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని సందర్భాల్లో కోర్టులనే తాత్కాలిక జైళ్లుగా గుర్తించిన ఉదాహరణలను ప్రస్తావించారు. అయితే, గవర్నర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య పొసగని నేపథ్యంలో ఇలాంటి అవకాశం కేజ్రీవాల్‌కు ఉండకపోవచ్చని అంటున్నారు.

మరోవైపు, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే వచ్చే న్యాయపరమైన సమస్యలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. సీఎం ప్రజాసేవకుడు కాబట్టి, ఆయనను సస్పెండ్ చేయడం లేదా పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వాధికారులు అరెస్టైనప్పుడు వెంటనే వాళ్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తారని గుర్తు చేశారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆప్ లీడర్లు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కె. కవిత అరెస్టైన విషయం తెలిసిందే.

More Telugu News