Tera Chinnapa Reddy: బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గుడ్‌బై

  • ఈ నెల 18నే కేసీఆర్‌కు రాజీనామా లేఖ
  • నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించాక రాజీనామా లేఖ విడుదల
  • బీజేపీ టికెట్‌పై అదే స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం
  • ఒకటి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న చిన్నపరెడ్డి
Tera Chinnapa Reddy Resigns BRS

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పార్టీని వీడారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఈ నెల 18న ఆయన కేసీఆర్‌కు లేఖ పంపగా, నిన్న సాయంత్రం చిన్నపరెడ్డి దానిని మీడియాకు విడుదల చేశారు. నల్గొండ లోక్‌సభ స్థానాన్ని ఆశించిన ఆయన.. ఆ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తర్వాత రాజీనామా లేఖను బయటపెట్టడం గమనార్హం.

చిన్నపరెడ్డికి బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నట్టు సమాచారం. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ నేత సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆయనను నల్గొండ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండడంతో ఇప్పుడా స్థానాన్ని చిన్నపరెడ్డికి కేటాయించి, సైదిరెడ్డికి మరో స్థానం కేటాయించాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హామీతోనే చిన్నపరెడ్డి బీఆర్ఎస్‌ను వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చిన్నపరెడ్డి తెలిపారు.

More Telugu News