Arvind Kejriwal: అత్యవసర విచారణ చేపట్టలేం.. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు నిరాశ

  • హోలీ సందర్భంగా కోర్టుకు 2 రోజుల సెలవులు
  • తిరిగి బుధవారం పున:ప్రారంభం కానున్న ఢిల్లీ హైకోర్టు
  • బుధవారం లిస్టింగ్‌కు రానున్న కేజ్రీవాల్ పిటిషన్
  • తన అరెస్ట్, ఈడీ కస్టడీకి అప్పగించడాన్ని సవాలు చేసిన కేజ్రీవాల్
No Urgent Hearing says Delhi High Court on Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్‌తో పాటు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ విధిస్తూ దిగువ స్థాయి కోర్టు తీసుకున్న నిర్ణయంపై సత్వరమే విచారణ జరిపి ఉపశమనం కల్పించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సత్వర విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. హోలీ సందర్భంగా కోర్టుకి 2 రోజులు సెలవులు ఉంటాయి. కోర్టు తిరిగి బుధవారం పున:ప్రారంభమవుతుందని, సెలవుల తర్వాత మొదటి పని దినమైన బుధవారం ఈ పిటిషన్‌ లిస్టింగ్‌కు వస్తుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రీ కూడా ధృవీకరించింది. కాగా తన అరెస్ట్, ఈడీ కస్టడీ విధింపు చట్టవిరుద్ధమని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరుసటి రోజు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తన అరెస్ట్, కస్టడీని వ్యతిరేకిస్తూ శనివారం కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నేడు ఆప్ నిరసనలు
తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆప్ నిర్ణయించింది. సీఎం కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునీత శనివారం ఈడీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఇక ఆప్ పార్టీకి చెందిన నేత ఒకరు మాట్లాడుతూ..  ఆదివారం ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆప్ నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తోందని, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడానికి నిరసనగా కొవ్వొత్తులతో నిరసన చేపట్టనున్నామని తెలిపారు. దిష్టిబొమ్మల దహనం కూడా ఉంటుందని ఆప్ నేత ఒకరు ప్రకటించారు.

More Telugu News