Andre Russell: పట్టువదిలిన సన్ రైజర్స్... మజిల్ పవర్ చూపించిన రసెల్

  • ఈడెన్ గార్డెన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ × సన్ రైజర్స్ 
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులు చేసిన కోల్ కతా
  • 25 బంతుల్లో 64 పరుగులు చేసిన రసెల్
  • రసెల్ స్కోరులో 3 ఫోర్లు, 7 సిక్సర్లు
Andre Russell hammers SRH bowlers

ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షంతో మైదానాన్ని ముంచెత్తాడు. 

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఓ దశలో 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హార్డ్ హిట్టింగ్ జోడీ రసెల్, రింకూ సింగ్ భారీ షాట్లతో కదం తొక్కారు. సన్ రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండేలను ఉతికారేశారు. ముఖ్యంగా రసెల్ ధాటికి సన్ రైజర్స్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 

రసెల్ కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ కండలరాయుడి స్కోరులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయంటే, అతడి ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రింకూ సింగ్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. 

అంతకుముందు, ఓపెనర్ ఫిల్ సాల్ట్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేసిన తన స్థానానికి న్యాయం చేశాడు. అయితే, సునీల్ నరైన్ (2), వెంకటేశ్ అయ్యర్ (7), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (0), నితీశ్ రాణా (9) తీవ్రంగా నిరాశపరిచారు. 

అయితే, రమణ్ దీప్ సింగ్ భారీ షాట్లతో రన్ రేట్ ను పెంచే ప్రయత్నం చేశాడు. రమణ్ దీప్ 17 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్సులతో చకచకా 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత రసెల్, రింకూ విజృంభణతో కోల్ కతా స్కోరు 200 మార్కు చేరుకుంది. 

సన్ రైజర్స్ బౌలర్లలో టి.నటరాజన్ 3, మయాంక్ మార్కండే 2, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 1 వికెట్ తీశారు.

More Telugu News