Lavu Sri Krishna Devarayalu: వైసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 

  • విశాఖలో డ్రగ్స్ కలకలం
  • ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగడం బాధాకరమని వెల్లడి
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఈవోకు వినతి
MP Lavu Srikrishna Devarayalu complains against YCP

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో తన పేరును వైసీపీ ట్వీట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. 

అమరావతిలో సచివాలయానికి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి ఆధారాలు లేకుండానే వైసీపీ తనపై ఆరోపణలు చేస్తోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు ఎవరో కుర్రాళ్లు పెడితే అనుకోవచ్చు, కానీ వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ఆ ఫొటోలు పోస్టు చేయడం చాలా బాధాకరమైన విషయం అని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. 

డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీలో తాను వాటాదారుడ్ని కాదు, బోర్డు మెంబర్ కాదని స్పష్టం చేశారు. 

అసలు, ఆ కంపెనీ తప్పు చేసిందన్న విషయమే ఇంకా నిర్ధారణ కాలేదని, అలాంటప్పుడు ఈ వ్యవహారంలోకి తన పేరు ఎలా లాగుతారని ప్రశ్నించారు. అందుకే ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చానని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం వారు హామీ ఇచ్చారని తెలిపారు.

More Telugu News