Arvind Kejriwal: ఢిల్లీ పోలీసు అధికారి ఏకే సింగ్‌ను నా భద్రత నుంచి తొలగించాలి: సీఎం కేజ్రీవాల్

  • కోర్టు ఆవరణలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆప్ అధినేత
  • గతేడాది మనీశ్ సిసోడియాతోనూ ఇదే రీతిలో ప్రవర్తించారని ప్రస్తావన
  • దుష్ప్రవర్తన కలిగిన అతడిని తన భద్రతా సిబ్బంది నుంచి తొలగించాలని అభ్యర్థన
  • రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్
Officer who misbehaved with Manish Sisodia misbehaved with me too says Delhi CM Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల కోర్టు ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసు అధికారి ఏసీపీ ఏకే సింగ్ తన విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కోర్టు ఆవరణలో తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన భద్రతా సిబ్బంది నుంచి ఆయనను తొలగించాలంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఏకే సింగ్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని పిటిషన్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. దుష్ప్రవర్తన స్వభావం ఉన్న అతడిని తొలగించాలన్నారు. అయితే కేజ్రీవాల్ పట్ల అధికారి ఏకే సింగ్ ఏవిధంగా ప్రవర్తించారనేది తెలియరాలేదు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా గతేడాది మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే మనీశ్ సిసోడియా మెడ పట్టుకొని ఏకే సింగ్ అడ్డుకున్నారు. వీడియోలో కూడా రికార్డయిన ఈ ఘటనపై సిసోడియా లిఖితపూర్వకంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. 

అయితే అధికారి ఏకే ఎలాంటి తప్పు చేయలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. భద్రత కోసం ఇలా వ్యవహరించామని, నిందితులు ఎవరైనా సరే మీడియాతో మాట్లాడడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రభావంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే సిసోడియాను హాజరుపరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును పోలీసులు కోరారు. కోర్టు ఆవరణలో ఆప్ మద్దతుదారులు, మీడియా ప్రతినిధులతో గందరగోళంగా అనిపిస్తోందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

More Telugu News