Eel In Colon: వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప.. ఆపరేషన్ చేసి వెలికితీత

  • వియత్నాంలో వెలుగు చూసిన ఘటన
  • మలద్వారం, పురీషనాళం మీదుగా పెద్దపేగులోకి చేరిన ఈల్ చేప
  • పేగుల్లో సజీవంగా ఉన్న చేపను చూసి వైద్యుల ఆశ్చర్యం
  • ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీసిన వైనం
12 Inch Eel Slides Up Vietnamese Mans Rectum Surgically Removed Alive

వియత్నాంలో తాజాగా అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి పెద్దపేగులోకి చొరబడ్డ ఈల్ చేపను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. క్వాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. పేగుల్లో సజీవంగా ఉన్న ఈల్‌ను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కోలాన్‌లో (పెద్ద పేగు చివరి భాగం) సజీవంగా ఉన్న 30 సెంటీమీటర్ల ఈల్ చేపను చూసి నోరెళ్లబెట్టారు. అతడి పేగులకు అది చిల్లులు పెట్టిందని కూడా గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. 

సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతమైనందుకు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములకు ఆవాసమైన పురీషనాళం పక్కనే కోలాన్ ఉండటంతో ఆపరేషన్ సందర్భంగా ఇన్ఫెక్షన్ తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే, శస్త్రచికిత్స తరువాత ఈ సమస్య లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

బాధితుడి మలద్వారం, పురీషనాళం మీదుగా ఈల్ చేప పెద్ద పేగులోకి చొరబడి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇది అసాధారణ ఘటన అని, పేగుల్లోకి చొరబడ్డాక కూడా ఈల్ చేప సజీవంగా ఉండటం ఆశ్చర్యకరమని అన్నారు. అతడి పేగులో గాయపడ్డ భాగాల్ని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని చెప్పారు.

More Telugu News