PM Narendra Modi: ర‌ష్యాలో ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన ప్ర‌ధాని మోదీ

  • ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఉగ్ర‌వాదుల న‌ర‌మేధం
  • 60 మందికి పైగా మృత్యువాత‌, మ‌రో 140 మందికి గాయాలు
  • ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా స్పందించిన మోదీ 
  • ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్ర‌క‌టన‌
PM Narendra Modi Condemns Heinous Terrorist Attack Says India Stands in Solidarity With Russia

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో శుక్ర‌వారం రాత్రి ఉగ్ర‌వాదుల న‌ర‌మేధానికి పాల్ప‌డ్డారు. క్రాక‌స్ సిటీ క‌న్స‌ర్ట్ హాల్‌లోకి ఆయుధాల‌తో ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చ‌నిపోగా, మ‌రో 140 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 'ఎక్స్' (గ‌తంలో ట్విట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించారు. ర‌ష్యా ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు సంఘీభావం తెలియ‌జేశారు. 

"మాస్కోలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు, క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌కు మా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాం. మా ఆలోచ‌న‌లు, ప్రార్థ‌న‌లు వారితోనే ఉంటాయి. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ర‌ష్యా ప్ర‌భుత్వానికి, ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం" అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్ర‌క‌టించింది.

More Telugu News