Harish Rao: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడం లేదు... మోదీకి అనుకూలంగా ఉన్నారు: హరీశ్ రావు

  • సీఎం తీరు బీజేపీకి బీ టీమ్ లీడర్‌లా కనిపిస్తోందని వ్యాఖ్య 
  • ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదని విమర్శ 
  • బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం
Harish rao fires at Revanth Reddy for his comments on liquor case

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడంలేదని... ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా పని చేస్తున్నారని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ, సీబీఐ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరు బీజేపీకి బీ టీమ్ లీడర్‌లా కనిపిస్తోంది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించడం లేదన్నారు.

మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లు తాము చెబుతున్నదే ఇప్పుడు ఖర్గే, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దర్యాఫ్తు సంస్థలను ప్రధాని మోదీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. మద్యం కేసు పేరుతో రాజకీయ వేధింపులు సరికాదన్నారు. ఈ విషయంలో తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందన్నారు. మద్యం కేసు అనేది ఒక కుట్ర అని... తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అక్రమ అరెస్టులని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులకు భిన్నంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మద్యం కేసులో నిందితుల అరెస్ట్ ఇప్పటికే ఆలస్యమైందని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ మనిషి కాదని, ఆరెస్సెస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అన్నారు. తాము ముందు నుంచీ అదే చెబుతున్నామని... అది అదే ఇప్పుడు నిజమని తేలిందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మరిచినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News