దేశానికి బీజేపీ మంచిది కాదు.. ఏపీకి రాజధాని లేకపోవడం బాధాకరం: షర్మిల
- దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అన్న షర్మిల
- దేశాన్ని అంబానీ, అదానీలకు దోచి పెట్టారని విమర్శ
- బీజేపీ మోసం చేస్తున్నా జగన్, చంద్రబాబు మౌనంగా ఉన్నారని మండిపాటు
దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని షర్మిల అన్నారు. దేశాన్ని అంబానీ, అదానీలకు దోచి పెట్టారని విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలు కూడా బీజేపీ మెప్పు కోసం పని చేస్తున్నాయని అన్నారు. ఏపీలో గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్ ను కూడా వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
బీజేపీన విమర్శించే నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వాటిని ప్రయోగిస్తున్నారని... ఈ దాడులకు భయపడి బీజేపీపై ఇష్టం లేకపోయినా చాలామంది బీజేపీలో చేరుతున్నారని షర్మిల అన్నారు. చివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కలుషితం చేశారని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని... ఆ తర్వాత దాన్ని విస్మరించిందని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. బీజేపీ మోసం చేస్తున్నా జగన్, చంద్రబాబు ఇద్దరూ మౌనం వహించారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా... రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు.